వినోద్ కుమార్ కు బినామీ సునీల్ రావు 

వినోద్ కుమార్ కు బినామీ సునీల్ రావు 
  •  బల్దియాలో అవినీతి  రాజ్యమేలుతుంది..?
  •  ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల లెక్క తేలుస్తాం
  •  గడీలు బద్ధలైన అహంకారం తగ్గడం లేదు
  • బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిల్లపు రమేశ్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బంధుప్రీతి లేకుంటే నీ బినామీ అయినా యాదగిరి సునీల్ రావు మేయర్ ఎలా అయ్యాడో చెప్పాలని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో స్పష్టం చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ సవాల్ విసిరారు. విద్యుత్ శాఖ లో అక్రమ ఉద్యోగ నియామకానికి సంబంధించి, వినోద్ కుమార్ ప్రమేయమే లేకుంటే అంతా ఉలిక్కిపాటు దేనికని ప్రశ్నించారు. విద్యుత్ శాఖలో అక్రమ నియామకం పొందిన  అసిస్టెంట్ ఇంజనీరు మీ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమ నియామకం కాదా అని ప్రశ్నించారు, నా బంధువు కాదని వినోద్ కుమార్ తప్పించుకుంటున్నాడని అన్నారు. అవినీతి, బంధుప్రీతి లేకుంటే వినోద్ కుమార్ నాటి ప్రభుత్వంలో జరిగిన దురాగతాలను ఎందుకు ఖండించడం లేదని, నాటి వ్యవస్థను ఎందుకు తప్పు పట్టడం లేదని ప్రశ్నించారు. 

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత నాలుగు సంవత్సరాలుగా మీఒత్తిడితో జరిగిన అక్రమ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి, స్మార్ట్ సిటీలో జరిగిన అవినీతి అక్రమాల లెక్కను తేలుస్తామని స్పష్టం చేశారు. ప్రజా కోర్టులో వినోద్ కుమార్ ను దోషిగా నిలబెట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందన్నారు. దొరల గడీలు బద్దలైన వినోద్ కుమార్ కు కుల అహంకారపు మాటలు మాత్రం ఆగడం లేదని ఆరోపించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాన్ లోకల్ అయిన వరంగల్ డ్రామా కంపెనీ అధినేత వినోద్ కుమార్ ను అదే వరంగల్ పొలిమేరలకు  తరుముతారాని హెచ్చరించారు. స్మార్ట్ సిటీ కాంట్రాక్టర్ ఇంటినే అడ్డాగా మార్చుకొని డ్రామా కంపెనీ కార్యకలాపాలు ఎలా నడుపుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ కుమార్ పై అవాకులు చవాకులు పేల్చితే ఖబర్దార్ అని హెచ్చరించారు. అసత్యాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తే కరీంనగర్ ప్రజానీకం నేడు బిఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరని హితుపలికారు.