బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి 

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి 

అప్పుడే సంక్షేమ పథకాలు కొనగుతాయి
కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంటు, నీటి సమస్యలు
భట్టి వల్ల ఏ ఉపయోగం లేదు
ఇందిరమ్మ రాజ్యంలో దుర్మర్గపు పాలన
మళ్లీ ఆ పాలన ఎందుకు
వైరా, మధిర ప్రజా ఆశీర్వాద సభల్లో  సీఎం కేసీఆర్ 

ముద్ర ప్రతినిధి, ఖమ్మం /మధిర/వైరా:  తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వస్తే  మళ్లీ కరెంటు, నీటి కష్టాలు తప్పవని హెచ్చరించారు.  పార్టీ మధిర అభ్యర్థి లింగాల కమల్ రాజు,  వైరా అభ్యర్థి మదన్ లాల్  విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా మధిర, వైరా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం సహజమన్నారు. ఈ నెల 30న పోలింగ్ వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపుతో దుకాణం బంద్ అయిందని అందరూ ఆలోచిస్తుంటారని, కానీ  మూడు నుంచే  దుకాణం ప్రారంభమవుతుందని ఆ ప్రభుత్వ పాలన మొదలవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకే కాంగ్రెస్ 50 యేళ్ల పాలన,  బీఆర్ఎస్ పదేళ్ల పాలన బేరీజు వేసుకొని ఓటును వేయాలని కోరారు. ఇది ఓటరుకు బ్రహ్మాస్త్రం అని ఐదేళ్ల మీ భవిష్యత్​తో పాటు రాష్ట్ర భవిష్యత్​మీపై ఆధారపడి ఉంటుందని గుర్తు చేసుకోవాలన్నారు.  మధిరలో  రెండుసార్లు తమ పార్టీ అభ్యర్థి కమల్ రాజును గెలిపించాక పోయినా తాను నియోజకవర్గానికి ఏం తక్కువ చేయలేదని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు కోసం నాలుగు మండలాలు ఎంపిక చేస్తే అందులో ఈ నియోజకవర్గం నుంచి చింతకాని మండలం మొత్తం అందరికీ దళితబంధు సహాయం చేశామన్నారు. మీ ఎమ్మెల్యే భట్టి అడగలేదు కనీసం దరఖాస్తు కూడా ఇవ్వలేదన్నారు.  గతంలో సీపీఎం ఎమ్మెల్యే బోడెపుడి వెంకటేశ్వరరావు వరి పంట తీసుకొచ్చి అసెంబ్లీలో చూపించారని నేడు ఆ పరిస్థితి లేదన్నారు.  కేంద్రంలో తమకు వ్యతిరేక ప్రభుత్వం ఉన్నా తెలంగాణ పలు అంశాల్లో నంబర్ వన్ ఉందని వారే ప్రకటించారన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఏ ఉపయోగం లేదన్నారు. ఎలక్షన్ లో  కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా దాటవని.. భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయ్యేది లేదని చెప్పారు. మధిరకు భట్టి చుట్టపు చూపుగా వస్తారని విమర్శించారు. రైతుబంధు రావాలంటే కమల్ రాజ్ ను గెలిపించండి తెలిపారు. మధిర ఎస్సీ నియోజకవర్గం అయినందున కమల్ రాజ్ ను గెలిపిస్తే మొత్తం దళితబంధు ఇస్తామన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గా గెలిపిస్తేనే బీఆర్ఎస్  ప్రభుత్వం వస్తుందన్నారు. మధిరలో 70వ సభ జరుగుతుందని, ఇంకా 30సభలు ఉన్నాయని తెలిపారు. మొత్తం సభలు కంప్లీట్ అయితే కాంగ్రెస్ క్లోజ్ అవుతుందన్నారు. అనంతరం మధిర అభ్యర్థి కమల్ రాజు మాట్లాడారు. తనను మూడుసార్లు ఓడించారని,  అయిన నియోజకవర్గాన్ని వదిలి పెట్టలేటలేదన్నారు. తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు. ఎల్లపుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గ పలు సమస్యలను ఆయన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


 అనంతరం వైరా సభలో పాల్గొన్న  కేసీఆర్ మాట్లాడుతూ... అభ్యర్థితోపాటు ఆయన వెనుక ఉన్న పార్టీ ఎటువంటిది.. వారు ఎంత మంచి చేశారనేది కూడా ఆలోచన చేయాలన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారని ఆమె హయాంలో దుర్మార్గ పాలన.. దరిద్రపు పాలన జరిగిందన్నారు.  మళ్లీ ఆ  పాలన ఎందుకని ప్రశ్నించారు. వైరా ప్రాజెక్టు కింద నీటి తిరువ పన్నులు కాంగ్రెస్ ప్రభుత్వంలో వసూలు చేశారని బీఆర్ఎస్ పాలనలో వాటిని రద్దు చేశామన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి అయితే ఉమ్మడి ఖమ్మం సస్యమలం అవుతుందన్నారు. వైరాను మున్సిపాల్టీగా చేసి అభివృద్ధి చేశామన్నారు. ఇటీవల ఎంపీ నామా వైరా రిజర్వాయర్ కోసం నీళ్లు అడిగితే వెంటనే విడుదల చేశామన్నారు. తన ఆలోచన కంటే ముందు  గోదావరి నీళ్లతో ప్రాజెక్ట్ కట్టాలని సీనియర్ మంత్రి అని చెపుకుంటున్న తుమ్మలకు ఎందుకు ఆలోచన చేయలేదని పరోక్షంగా కేసీఆర్ విమర్శించారు. అసెంబ్లీ గేట్లు తాకనివ్వబోనని అంటున్న డబ్బు మదంతో ఉన్న ఒకాయన నోట్ల కట్టలు హైదరాబాద్ లో దొరుకుతున్నాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయా సభల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్ధసారధిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.