అప్పులు చేసిండు.. ఇల్లు సక్కదిద్దుకున్నాడు

అప్పులు చేసిండు.. ఇల్లు సక్కదిద్దుకున్నాడు

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ తీన్మార్ మల్లన్న

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్ : ‘ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల కుప్ప చేసిండు. ఇంటికో ఉద్యోగం అని ఇంటిల్లిపాదికి ఉద్యోగాలు ఇచ్చుకుని ఇల్లు సక్క దిద్దుకున్నడు’ అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సింగపూర్ ఇందిరతో కలిసి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రాణ త్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చండి ఆరోపించారు.

నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఊదరగొట్టి ఇంటిల్లిపాదికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ధ్వజమెత్తారు. రెండు దఫాలుగా ప్రజలకు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ ఇండ్లు, మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు గాని గల్లీకో బెల్ట్ షాప్ తెరిచి పేదల రక్తాన్ని తాగుతున్నాడు విమర్శించారు. నిన్న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో బాతాల పోశెట్టి (కేసీఆర్) గొప్పలు చెబుతుంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, రాజయ్యలు గంగిరెద్దుల తలుపుతున్నారన్నారు. పదేళ్లలో లెదర్ పార్క్, టెక్​టైల్స్ పార్కు ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వేల కోట్ల రూపాయలు దండుకున్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మల్లన్న పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, కట్ట మనోజ్ రెడ్డి, జెడ్పీటీసీ మారపాక రవి, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీశ్​రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.