సమోసాలో కండోమ్స్, గుట్కా ప్యాకెట్లు!

సమోసాలో కండోమ్స్, గుట్కా ప్యాకెట్లు!
  • అయిదుగురు నిందితుల అరెస్టు

పుణె: పుణె నగరంలోని పింపిరి చించ్వాడ్ ప్రాంతంలోని ఒక ఆటోమొబైల్ కంపెనీకి చెందిన క్యాంటీన్ లో సమోసాలో కండోమ్స్, గుట్కా ప్యాకెట్లు, రాళ్లు దర్శనమిచ్చాయి. దీనిపై ఆటో మొబైల్ కంపెనీ చేసిన ఫిర్యాదు మేరకు అయిదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఉద్దేశపూర్వకంగానే ఆ సమోసాలు సరఫరా చేసే సంస్థకు చెడ్డపేరు రావాలని ప్రత్యర్థులు చేసిన కుట్రగా ఇది బహిర్గతమయ్యింది. వివరాల్లోకి వెళితే... ఆ ఆటోమొబైల్ కంపెనీ క్యాంటీన్ కి కేటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ అనే సంస్థ స్నాక్స్ సరఫరా చేస్తుంది. ఈ కంపెనీ సమోసాలు తమకు సరఫరా చేయాల్సిందిగా మనోహర్ ఎంటర్ ప్రైజెస్ సంస్థను కోరింది. వారే ఈ సమోసాలు సరఫరా చేశారు. అయితే, ఇక్కడే కుట్ర జరిగింది. గతంలో ఇదే కంపెనీకి ఎస్ ఆర్ఏ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ సమోసాలు ఇచ్చేది. వీరు సరఫరా చేసిన సమోసాలలో ఒకసారి బ్యాండేజ్ క్లాత్ రావడంతో వారి కాంట్రాక్ట్ రద్దు చేసి, తాజాగా మనోహర్ ఎంటర్ ప్రైజెస్ కు సప్లయి ఆర్డర్ ఇచ్చారు. వీరిని కూడా ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఎస్ఆర్ఎ ఎంటర్ ప్రైజెస్, తమకు చెందిన ఇద్దరు ఉద్యోగులను అక్కడికి పంపించి ఈ దారుణానికి పాల్పడింది. ఆ ఇద్దరు ఉద్యోగులే ఇలా సమోసాలలో కండోమ్స్, గుట్కా ప్యాకెట్లు, రాళ్లను నింపారు. ఈ కేసులో పోలీసులు ఆ ఇద్దరు ఉద్యోగులు ఫిరోజ్ షేక్, విక్కీషేక్ లతో పాటు, ఎస్ఆర్ఎ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రహీమ్ షేక్, అజర్ షేక్, మజర్ షేక్ లను  అరెస్టు చేశారు. అయిదుగురిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసును విచారణ చేస్తున్నారు.