దొంగతనం చేశాడని పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం...?

దొంగతనం చేశాడని పోలీసుల థర్డ్ డిగ్రీ ప్రయోగం...?
Police third degree on thief
  • ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతున్న యువకుడు
  • మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు

ముద్ర ప్రతినిధి, మెదక్: మహిళ మెడలో నుంచి  బంగారం దొంగతనం చేశాడని అనుమానంతో పట్టణ పోలీసులు ఓ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఐదు రోజుల తరువాత అతన్ని వదిలి పెట్టగా.. ఒళ్ళు హూనం అయిన బాధితుడు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. గురువారం  బాధితుడు ఖాదిర్ ఖాన్  తెలిపిన వివరాలలి ఉన్నాయి... మెదక్ పట్టణం అరబ్ గల్లిలో గత నెల 29వ తేదీన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. ఈ నేపథ్యంలో మెదక్ పోలీసులు సీసీ కెమెరా పుటేజి ఆధారంగా హైదరాబాద్ లో చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటూ పని చేసుకునే స్థానిక పిట్లంబేస్ వీధికి చెందిన మహమ్మద్ ఖదీర్ ఖాన్ ను పట్టుకొచ్చి ఇష్టారీతిగా దెబ్బలు కొట్టారు. వీపులో దెబ్బల వాతలతోపాటు పిరుదులపై సైతం కొట్టారు. తర్వాత దొంగతనం చేయలేదని నిర్దారణకు వచ్చిన పోలీసులు ఈ నెల 2న పోలీసులు అతన్ని వదిలి పెట్టి ఇంట్లో నుండి బయటకు వెళ్ళారాదని సూచించారు.

ఇంటికి వెళ్ళిన ఖదీర్ ఖాన్ దెబ్బలకు తాళలేక పోయాడు. విపరీతమైన నొప్పులతో బాధపాడుతూ 6వ తేదీన కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. బుధవారం కుటుంబ సభ్యులు అతన్ని మెదక్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కాగా పోలీసులు తీవ్రంగా  కొట్టడంతో కిడ్నీలు దెబ్బతిన్నాయని, చేతులు పనిచేయడం లేదు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. చంద్రశేఖర్ సూచించారు. తన భర్తను అకారణంగా పోలీసులు కొట్టారని బాధితుని భార్య సిద్దేశ్వరి రోదిస్తూ తెలిపింది. ఎలాంటి తప్పు చేయకున్నా హైదరాబాద్ లో లేబర్ పనిచేసుకునే తన భర్త ఖాదిర్ ను పోలీసులు అకారణంగా పట్టుకువచ్చి చితకబాదారని ఆమె  ఆరోపించారు. ప్రస్తుతం తన భర్త పరిస్తితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేసి న్యాయం చేయాలని సిద్దేశ్వర కోరారు. సమాచారం తెలుసుకున్న ఎస్బి, ఇంటలిజెన్స్ పోలీసు అధికారులు ఆసుపత్రి చేరుకొని జరిగిన సంఘటనపై బాధితుడితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు.