ఆందోళనలో 9,10 చదివే విద్యార్థులు

ఆందోళనలో 9,10 చదివే విద్యార్థులు
Students studies is problem
  • పంతుళ్ళ సహాయ నికణాకరణతో కుంటుబడ్డ బోధన
  • ఆవేదనలో విద్యార్థుల తల్లదండ్రులు.
  • పండితుల ఉద్యమ ప్రభావంతో తలలు పట్టుకుంటున్న హెడ్ మాస్టర్ లు
  • 9వ రోజుకు చేరిన భాషా పండితుల సహాయ నిరాకరణ ఉద్యమం

ముద్ర ప్రతినిధి,వికారాబాద్: రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది పది తరగతుల బోధనను బహిష్కరిస్తూ భాషా పండితులు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పదవ తరగతి ప్రీ ఫైనల్, ఫైనల్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో భాషా పండితుల సహనిరాకరణ ఉద్యమం వలన, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 9,10 తరగతుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వము వెంటనే స్పందించకపోతే పదవ తరగతిలో తమ పిల్లల ఉత్తీర్ణత శాతం పై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ లు సైతం పాఠశాలలకు వచ్చి ప్రధానోపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు.

పదవ తరగతి సిలబస్ పూర్తి అయినప్పటికీ, పునరుష్చరణ జరగకపోతే మంచి మార్కులు రావని ఆందోళనకు గురవుతున్నారు. ప్రధానోపాధ్యాయులు కూడా ఇటు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ లకు సమాధానం చెప్పుకోలేక, అటు జిల్లా విద్యాధికారి నుండి ఎలాంటి ఆదేశాలు రాకపోవడం కారణంగా, ఏమి చేయలేక  సతమతమవుతున్నారు. భాషా పండితులు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి 6,7,8 తరగతులను బోధిస్తున్నారు. పాఠశాలలకు వచ్చిన గ్రామస్తులకు తమ సమస్య గురించి అవగాహన కల్పిస్తున్నారు. దశాబ్దాల వెట్టి చాకిరి గురించి తెలుసుకున్న గ్రామస్తులు కూడా భాషా పండితులకు మద్దతు తెలుపుతున్నారు. భాషా పండితుల సమస్యలను వెంటనే పరిష్కరించి, 9,10 తరగతుల విద్యాబోధనను తిరిగి ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వానికి జిల్లాలోని అన్ని పాఠశాలల తల్లిదండ్రులు  కోరుతున్నారు.

సీఎం కేసీఆర్ కు విద్యార్థుల వేడుకోలు:-

బాషా పండితుల సహాయ నిరాకరణతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.కేసీఆర్ సార్ పెద్ద మనసుతో కరుణించి మా చదువుకు ఆటంకం కలగకుండా త్వరగా స్పందించండి అంటూ సీఎం ను చేతులు జోడించి వేడుకుంటున్నారు.ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతున్న మీరు మా పండితుల,మా విద్యార్థుల సమస్యలను తీర్చండి అని కోరుతున్నారు.