5 లక్షల కోట్ల అప్పు చేసింది..

5 లక్షల కోట్ల అప్పు చేసింది..
  • ఇంటికో బెల్టు షాపు తెరిచింది
  • కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న టిఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్లలో రూ.5 లక్షల కోట్ల అప్పు చేసింది.. ఇంటికో బెల్టు షాపు తెరిచి తాగుబోతుల తెలంగాణగా మార్చిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఇందిర అభ్యర్థిగా ప్రకటించిన మొదటిసారి బుధవారం నియోజకవర్గానికి వచ్చింది. నిడిగొండ దర్గాలో, చిల్పూర్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 33 శాతం మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడిన టిఆర్ఎస్ ప్రభుత్వం 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులలో ఎంతమంది మహిళలకు ఇచ్చారని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పార్టీ కడియం అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ పార్టీ రెండు ముక్కలైందని ముక్కలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకటైందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతుందని స్టేషన్ ఘన్ పూర్ లో అందరం కలిసికట్టుగా పనిచేసి జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన వాగ్దానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ కి ఓటు వేయమని విజ్ఞప్తి చేయాలన్నారు. 108, ఆరోగ్యశ్రీ,, ఫీజు రియంబర్స్మెంట్ ఇందిరమ్మ ఇండ్లు మొదలైన మన స్కీములకు తోకలు ఈకలు తగిలించి వాళ్ల మేనిఫెస్టో గా టిఆర్ఎస్ ప్రకటించుకోవడం సిగ్గుచేటు అన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు అనుభవించాడని అలాంటప్పుడు మరో అభ్యర్థికి టిక్కెట్టు ఈయవచ్చు కదా అని ప్రశ్నించారు. శ్రీహరికి దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగాలన్నారు. ల్యాండ్, సాండ్ మాఫియా, పేపర్ లీకేజీ లో సిద్ధహస్తులు కెసిఆర్ కుటుంబ సభ్యులను టిఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు శిరీష రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ వరలక్ష్మి నరేందర్, లింగాద్రి, జగదీష్ చంద్ర రెడ్డి, మంచాల ఎల్లయ్య, గడ్డమీద సురేష్, మేరీ, లావణ్య, సింగపురం వెంకటయ్య, ఇనుగాల వెంకటేశ్వర్ రెడ్డి, చెవుల యాదగిరి, కేశిరెడ్డి లక్ష్మారెడ్డి, బుచ్చిరెడ్డి, కోళ్ల రవి, గుర్రం ప్రసాద్, కొత్త సంపత్, శివుడు, జోగా రెడ్డి, తిరుపతి రెడ్డి, అన్నేబోయిన బిక్షపతి, ఊమ్లా నాయక్, సద్దాం హుస్సేన్, ఝాన్సీ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.