రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ..

రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ..
  • అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం..
  •  రైతులకు చాలీచాలని ఉచిత విద్యుత్ ఇస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం..
  • ప్రెస్ మీట్ లో గండ్ర సత్యనారాయణ రావు. 

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: రైతుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించి, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని టీపీసీసీ సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి గండ్ర సత్యనారాయణ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి, ప్రైవేటు విద్యుత్ సంస్థల దగ్గర అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తూ కమీషన్లు దండుకుంటున్నది సీఎం కేసీఆర్ అని అన్నారు. 

రైతులకు చాలీచాలని ఉచిత విద్యుత్ ఇస్తూ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడుతుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు అబద్ధపు మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని, ఖబడ్దార్ బీఆర్ఎస్ నాయకుల్లారా అని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి, బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మా నాయకుడు రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని అన్నారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టిపిసిసి సభ్యులు చల్లూరి మధు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, 16వ వార్డు కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు భట్టు కరుణాకర్, రూరల్ మండల యూత్ అధ్యక్షుడు తోట రంజిత్, నాయకులు అంబాల శ్రీనివాస్, నగునూరి రజినీకాంత్, పృద్వి, చుంచుల మహేష్, ఎస్ పి కె సాగర్ తదితరులు పాల్గొన్నారు.