భువనగిరి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్

భువనగిరి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న డిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్
  • సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన చెవిటి
  • రాజకీయరంగంలో అంచలంచెలుగా ఎదిగిన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్
  • భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సై అంటున్న చెవిటి వెంకన్న యాదవ్


తుంగతుర్తి ముద్ర:-తుంగతుర్తి నియోజకవర్గం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెవిటి వెంకన్న యాదవ్ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఆది నుండి అనేక పదవులు నిర్వహిస్తూ అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పదవి నిర్వహిస్తున్నారు .యూత్ కాంగ్రెస్ నేతగా రాజకీయ  ఆరంగేట్రం చేసిన  వెంకన్న యాదవ్ తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా రెండుసార్లు పదవి ఎలాంటి మచ్చ లేకుండా నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. ముఖ్యంగా బీసీ వర్గాల్లో చెవిటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. కార్యకర్తలను ఆదుకోవడం తోపాటు పార్టీని పటిష్టంగా చేయడంలో  చెవిటి పాత్ర గణనీయ మైనదని చెప్పవచ్చు. పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా నియోజకవర్గంలో క్యాడర్ అధైర్య పడకుండా అన్ని మండలాలను కలియ తిరుగుతూ కార్యకర్తలకు అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల నాయకుల మన్ననలు పొందారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండడమే కాక పీసీసీ ఇచ్చిన ఆదేశాలను జిల్లాలో తూచా తప్పకుండా అమలయేలా చేశారు. పీసీసీ అధ్యక్షుడు సైతం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా చెవిటిని సూచించవచ్చని మాట వినవస్తోంది. అంతేగాక ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో సంబంధాలు కలిగి  ఉన్నారు.  రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంటు స్థానం నుండి  వెంకన్న యాదవ్ పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం కాంగ్రెస్ అధిష్టానానికి సైతం చెవిటి వెంకన్న యాదవ్ తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీలో యాదవ సామాజిక వర్గంలో మంచి పట్టున్న చెవిటికి భువనగిరి పార్లమెంటు టికెట్ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెవిటి సునాయాసంగా విజయ సాధిస్తారని మాట సర్వత్ర విలువ వస్తుంది .కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం నెరవేర్చినట్లు కూడా అవుతుందని మాట పలువురు అంటున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాల్లో ఒకటి బీసీలకు ఇవ్వాలని బీసీ కార్యకర్తలు ,నాయకులు ముక్తకంఠంతో కోరుతున్నారు.  బీసీలకు టికెట్ ఇచ్చిన పక్షంలో అది చెవిటి వెంకన్న యాదవ్ కు ఇవ్వాలని పలువురు బీసీ నాయకులు కోరుతున్నారు. రాజకీయంగా సుమారు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీనీ అంటిపెట్టుకొని పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న  వెంకన్న యాదవ్ ఎంపీగా పోటీ చేయడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయని బీసీ నాయకులు చెబుతున్నారు. అంతేకాక మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉంటాయని చెబుతున్నారు .భువనగిరి పార్లమెంటు స్థానం చెవిటి వెంకన్నకు ఇచ్చినట్లయితే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని బీసీ నేతలు మాట. ఏది ఏమైనా భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధం అనే మాట చెవిటి వెంకన్న యాదవ్ తన అనుయాయుల వద్ద చెబుతున్నారు .మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెవిటికి భువనగిరి పార్లమెంటు స్థానం ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.