ప్రజావ్యతిరేక పార్టీలను ఓడించండి

ప్రజావ్యతిరేక పార్టీలను ఓడించండి
  •  సీపీఎం ప్రజా పక్షపాతి
  • కానకరెడ్డిని ఆశీర్వదించండి
  • సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ

ముద్ర ప్రతినిధి, జనగామ: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలన సాగిస్తున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ పిలుపునిచ్చారు. జనగామ నియోజకవర్గం సీపీఎం ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకా రెడ్డి గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం జనగామ పట్టణంలోని ప్రెస్టన్ గ్రౌండ్ నుంచి ఆర్ అండ్‌ బి గెస్ట్ హౌస్ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ధర్మ కొండల్ రెడ్డి గ్రౌండ్‌లో నిర్వహించిన సభకు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అముదాల మల్లారెడ్డి అధ్యక్షత వహించగా సుభాషిణి అలీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు ఎక్కవ అయ్యాయన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసిందని ఆరోపంచారు.

కార్మిక చట్టాలు రద్దు చేసిందని మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ధరలు ఆకాశాన్ని అంటాయని ఆవేదన వ్యక్యం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టారన్నారు. ఇక తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇసుమంత కూడా పని చేయకుండా సంక్షేమ పథకాలతో ప్రజలను మోసం చేస్తుందని, చదువు కున్న యువకులకు ఉపాధి అవకాశాలు విఫలమైందని ఆరోపించారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పని చేసే సీపీఎం అభ్యర్థి మోకు కనకారెడ్డిని గెలిపించాలని కోరారు.

అనంతరం కనకారెడ్డి మాట్లాడుతూ 30 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉంటూ అనేక పోరాటాలు చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని తెలిపారు. తనను గెలిపిస్తే జనగామ నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేస్తానన్నారు. ఈ బహిరంగ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్, కాసు మాదవి, అర్.ఎల్ మూర్తి, హన్మకొండ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, సాంబరాజు, యాదగిరి సింగారాపు రమేష్, రాపర్తి సోమయ్య, సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ళబండి శశిధర్, సత్తిరెడ్డి, జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి తదితరులు పాల్గొన్నారు.