ఖిలాషాపురం గ్రామాన్ని  మండలంగా ప్రకటించాలి

  • నిరసనకు దిగిన గ్రామస్తులు
  • ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం
  • జేఏసీ నాయకుల వెల్లడి

ముద్ర ప్రతినిధి, జనగామ (రఘునాథపల్లి) : జనగామ జిల్లా ఖిలాషాపురం గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామ ప్రజలు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం గ్రామంలోని అంబేద్కర్‌‌ సెంటర్‌‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు శాగ కైలాసం, దొంగ మైపాల్ రెడ్డి, కొడిదేటి శంకర్, నక్క సుదర్శనం, శాగ శ్రీను, గజ్జి వీర వజ్రయ్య, శివరాత్రి సిద్దులు, యామంకి సుధాకర్, లక్మీనర్సయ్య, చంద్రమౌళి, యాదగిరి, కుమార్, రాజు తదితరులు మాట్లాడారు. ఖిలాషాపురం గ్రామాన్ని మండలం చేయాలని ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు చేసినట్టు తెలిపారు. పలు మార్లు గ్రామ ప్రజాప్రతినధులు, ప్రజలంతా కలిసి కలెక్టర్‌‌కు వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. అయితే ప్రభుత్వం తమ విన్నపాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నో గ్రామాలను మండలాలు చేసిన కేసీఆర్‌‌ సర్కారు తమపై ఎందుకు వివక్ష చూపుతుందో అర్థం కావడం లేదన్నారు. తమ గ్రామాని ఎంతో చరిత్ర ఉందని.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్‌ నెరవేర్చాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.