‘వల్మిడి’ అభివృద్ధిని వేగవంతం చేయండి: కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య

‘వల్మిడి’ అభివృద్ధిని వేగవంతం చేయండి: కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ: వల్మిడి రామాలయంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌‌ సి.హెచ్‌ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం వల్మిడి ఆయలంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాల్మిడి ఆలయ అభివృద్ధి పనులను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంట వెంటనే పూర్తి చేయాలన్నారు. కొండపై ఉన్న శ్రీఆండాళ్ అమ్మవారి గుడి, కోనేరు వద్ద భక్తుల కోసం మెట్లు ఏర్పాటు చేయాలని, కొండపై ప్లాంటేషన్ వేప, మేడి, అల్లో నేరేడు, ఉసిరి తదితర మొక్కలను నాటాలని సూచించారు. కొండ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయ పనులు, స్నాన ఘట్టాలు, విద్యుత్, రోడ్లు మిషన్ భగీరథ తదితర పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

అనంతరం పాలకుర్తి మండల కేంద్రంలో కోరమండల్ ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేయాలన్నారు. ఆ తర్వాత లింగాలఘణపురం మండలం సిరిపురం గ్రామంలో పాఠశాల ఆవరణంలో నిర్మిస్తున్న ఇంకుడు గుంతను పరిశీలించారు. మొక్కల సంరక్షణను తనిఖీ చేసి గ్రామంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌‌ వెంట డీఆర్డీవో పీడీ రామిరెడ్డి, పీఆర్, ఆర్అండ్‌ బీ, మిషన్ భగీరథ, ఈఈలు చంద్రశేఖర్, హుస్సేన్, శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి లత, ఆర్డివో కృష్ణవేణి, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, టూరిజం అధికారి గోపాలరావు, ఎంపీపీ నాగిరెడ్డి, డీఏవో వినోద్ కుమార్, సర్పంచ్ యాకంతరావు తదితరులు ఉన్నారు.