ప్రజావాణికి వినతుల వెల్లువ

ప్రజావాణికి వినతుల వెల్లువ
  • నెల రోజు తర్వాత మొదలై గ్రీవెన్స్‌
  • అర్జీదారులతో కిటకిటలాడిన కలెక్టరేట్

ముద్ర ప్రతినిధి, జనగామ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దాదాపు నెల రోజు పాటు ఆగిన ప్రజావాణి ఎట్టకేలకు సోమవారం తిరిగి ప్రారంభమైంది. కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మొత్తం 71 దరఖాస్తులు రాగా అందులో  రెవెన్యూ శాఖకు సంబంధించినవి 50, పంచాయతీరాజ్ 7, సివిల్ సప్లై 2, పురపాలక సంఘం 4 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ అధికారులు తెలిపారు.

ఒక్కొక్కరిది ఒక్కో సమస్య...
జఫరగఢ్ మండలం సాగరానికి చెందిన వజీరు చైతన్య తనకు వితంతు పెన్షన్ కార్డు వచ్చినా డబ్బులు రావడం లేదని కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేసింది. ఇందుకు స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారిని వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే జఫర్‌‌గఢ్‌ మండల కేంద్రానికి చెందిన పులి లచ్చయ్య తమ భూమిపై కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న రిజిస్ట్రేషన్ చేశారని ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాల్సిందిగా కోరారు.  పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తున్న పశుమిత్రులను వర్కర్లుగా గుర్తించాలని, కనీస వేతనం ఇవ్వాలని ఆ సంఘం లీడర్లు కోరారు. ఈ మేరకు సామూహికంగా కలెక్టరేట్‌కు వచ్చి వినతి పత్రం అందజేశారు.  జనగామ మండలం పెదరామంచెర్లకు చెందిన గూడ బుచ్చిరెడ్డి, పట్టేదారు పాస్‌ బుక్కులు మంజూరు యాలని దరఖాస్తు చేసుకున్నారు. 

జనగామ పట్టణం గిర్నిగడ్డకు చెందిన శౌర్య తనకు పెన్షన్ మంజూరైందని వేలిముద్రల సమస్య వల్ల పెన్షన్ రావడంలేదని ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు.  బచ్చన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన బూడిద ఆండాలు తనకు దివ్యాంగుడైన కుమారుడు ఉన్నాడని తనకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌‌ ఆర్డీవో కృష్ణవేణి, డీపీవో రంగాచారి, సీపీవో ఇస్మాయిల్, డీఏఓ వినోద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.