సుభద్ర పోస్టుమార్టంపై తప్పుడు ప్రచారం

సుభద్ర పోస్టుమార్టంపై తప్పుడు ప్రచారం
  • తప్పుడు వార్తలపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం 
  • జిల్లా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజు

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సదాశివునిపేట గ్రామానికి చెందిన సుభద్ర పోస్ట్ మార్టంపై కొన్ని చానల్స్‌, పేపర్లు (ముద్ర కాదు) తప్పడు ప్రచారాలు చేస్తున్నాయని జిల్లా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌‌ సుగుణాకర్‌‌రాజు మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ డాక్టర్లపై నోటి వచ్చినట్టు మాట్లాడుతున్న ఆ మీడియా ప్రతినిధులపై ప్రెస్‌ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. జనగామ జిల్లా ఆస్పత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుభద్ర అనే పేషెంట్‌ 2022 అక్టోబర్‌‌ 20న రాత్రి 8.30 గంటకు జనగామ ఆస్పత్రికి వచ్చిన విషయం వాస్తవమే అన్నారు. ఆమెను తీసుకొచ్చన బంధువులు ఫిట్స్‌, పాము కాటు అని చెప్పడంతో అందుకు తగిన ట్రీట్‌మెంట్‌ ఇచ్చామన్నారు. 

అయితే పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌ రెఫర్ చేశామన్నారు. మార్గ మధ్యంలో ఆమె చనిపోయిందని, తర్వాత బంధువులు ఇక్కడకు రాకుండానే మృతదేహాన్ని కననం చేశారని వివరించారు. దాదాపు 35 రోజుల తర్వాత స్థానిక తహసీల్దార్‌‌ ఆదేశాలతో డాక్టర్ ప్రదీప్, డాక్టర్  రాహుల్ ఆయన సమక్షంలో వెళ్లి పోస్టుమార్టం చేశారని తెలిపారు. అందుకు సంబంధించి సమగ్ర రిపోర్టును ఇచ్చామని, ఇందులో ఎటువంటి తప్పుడు సమాచారం లేదని స్పష్టం చేశారు. అయితే కొంతమంది కావాలని డాక్టర్లపై, సూపరింటెండెంట్‌ అయిన తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. మీడియా ప్రజలకు వాస్తవాలు తెలపాలి తప్ప ఇలా తప్పడు వార్తలు రాయవద్దని హితవుపలికారు. సమావేశంలో ఆర్‌‌ఎంవో మహేశ్‌కుమార్‌‌, డాకర్లు రాహుల్, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.