విద్యుత్ ఏ సి డి చార్జీల పేరిట దోపిడి

విద్యుత్ ఏ సి డి చార్జీల పేరిట దోపిడి
  •  దోచుకోవడమే బిఆర్ఎస్ ప్రభుత్వ పాలసీ
  • బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :గృహ విద్యుత్ వినియోగదారుల నుండి  ముందస్తు వినియోగ డిపాజిట్ (అడిషనల్  కన్జమ్షన్ డిపాజిట్ ) బిల్లుల పేరిట  ప్రభుత్వం బలవంతంగా విద్యుత్ వినియోగదారుల నుండి బిల్లులు వసూళ్లు చేయడానికి   అందించిన డిమాండ్  నోటీసులను, ఏ సి డి చార్జీల వసూళ్ల నిర్ణయాన్ని  వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ  భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ లోని విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఏ సి డి బిల్లులు వెంటనే రద్దు చేయాలని , డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఎస్. ఈ  వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  మాట్లాడుతూ రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేయాలని, దోచుకోవాలనే లక్ష్యంతో ఉందని , లోగడ ఏ సి డి చార్జీలను  రద్దు చేసినట్టే చేసి, నేడు మళ్లీ గృహ విద్యుత్ వినియోదారులకు  డిమాండ్ నోటీసులు  అందించి బలవంత వసూళ్లకు శ్రీకారం చుట్టిందని ఆయన మండిపడ్డారు. విద్యుత్ వినియోగదారుల నుండి  ఏ సి డిచార్జీలు వసూలు చేయవద్దని లోగడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని నెలల క్రితం ఉధృతమైన ప్రజా పోరాటాలు చేస్తే , ఏ సి డి చార్జీల వసూళ్ల ను నిలిపివేసినట్లు ప్రకటించి , నేడు తాజాగా ఏ సి డి చార్జీలు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయడాన్ని బిజెపి జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులను ముప్పు తిప్పలు పెడుతుందని, విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రతి నెల బిల్లులు చెల్లిస్తున్న అదనంగా ఏ సి డి చార్జీలను వసూలు చేయడంఅన్యాయమన్నారు. ముఖ్యంగా వాణిజ్య వినియోగదారుల నుండే వసూలు చేసే ఏ సి డి చార్జీలను , గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా వర్తింప చేయడం సమంజసం కాదన్నారు.  

కరెంటు వినియోగానికి అనుగుణంగా ట్రాన్స్ కో విద్యుత్ స్లాబ్ రేట్లు ప్రకారం బిల్లులు చెల్లిస్తున్న , తిరిగి ఏసిడి చార్జీలు గృహ విద్యుత్ వినియోదారులకు విధించడం భావ్యం కాదన్నారు. ప్రభుత్వ, విద్యుత్ ట్రాన్స్ కో నిర్ణయాల తో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, ఏ సి డి చార్జీ ల విధింపు గృహ విద్యుత్ వినియోగదారులకు ఆర్ధిక భారంగా మారిందన్నారు. అడ్డగోలు వసూలు,విపరీతమైన చార్జీల పెంపుతో బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కరెంటు, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్, డీజిల్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇంటి పన్ను, మద్యం ధరల పెంపు ఇలా ఏ ఒక్క రంగాన్ని కూడా  వదిలిపెట్టకుండా కెసిఆర్ సర్కార్ విపరీతంగా ధరలను పెంచి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని మండపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ వినియోగదారులను దోపిడీ చేయడమే లక్ష్యంగా కెసిఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుందన్నారు.  ముఖ్యంగా రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో ఏడుసార్లు విద్యుత్ బిల్లులను గణనీయంగా పెంచిందని, కస్టమర్ చార్జీలు, డెవలప్మెంట్ చార్జీలతో లోగడనే విద్యుత్ వినియోగదారులను అడ్డగోలుగా దోచుకుందని అన్నారు. ఏ సి డి పై డిమాండ్ నోటీసులను  ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు,  జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట రెడ్డి,  గుర్రాల వెంకట్ రెడ్డి ,జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర ,జానపట్ల స్వామి ఎడమ సత్యనారాయణ రెడ్డి, సుధాకర్ ,  ,దుర్శెట్టి  సంపత్, జాడి బాల్రెడ్డి,  బండ రమణారెడ్డి, పెరుక శ్రావణ్ , పుప్పాల రఘు, బల్వీర్ సింగ్ ,  కరీంనగర్ జోన్ల అధ్యక్షులు నరహరి లక్ష్మారెడ్డి,  పాదం శివరాజ్ ,ఆవుదుర్తి శ్రీనివాస్, మామిడి చైతన్య , మామిడి రమేష్ , రాగి సత్యనారాయణ  తదితరులు పాల్గొన్నారు.