ఎన్ని‘కల’ నినాదం కాదు ఆచరణలో పెట్టండి

ఎన్ని‘కల’ నినాదం కాదు ఆచరణలో పెట్టండి

 ఏ ఐ ఎఫ్ బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనగానే ప్రభుత్వానికి సామాజిక వర్గాల వారిగా ప్రేమ మొదలైందని ఆయా కులాల వారిని అక్కున చేర్చుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఏ ఐ ఎఫ్ బి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమీపించగానే వైశ్య, రెడ్డి కార్పోరేషన్ లను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం వెనక ఓటు బ్యాంకు రాజకీయాలు కనిపిస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిబద్దత కనిపించడం లేదన్నారు. దశాబ్ద కాలం నుండి ఈ రెండు సామాజిక వర్గాల కార్పోరేషన్ లు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా పలుమార్లు సానుకూలత వ్యక్తం చేసి కూడా ఆచరణలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు కూడా వైశ్య, రెడ్డి కార్పోరేషన్ ల ఏర్పాటు అనేది ఎన్నికల నినాదంగా వినిపిస్తున్నారని మేం భావిస్తున్నామన్నరు.

ఆయా సామాజిక వర్గాలపై నిజంగా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రెండు కార్పోరేషన్ లను ఏర్పాటు చేసి నిధులు కెటాయించే వారని తొమ్మిదేళ్ల పాలనలో వాటి ఊసు ఎత్తకుండా ఇప్పుడు కార్పోరేషన్ లు ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు చేయడం సిగ్గుచేటు అన్నారు. తాజాగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమించిన ప్రభుత్వానికి వైశ్య, రెడ్డి కార్పోరేషన్ విషయంలో మీనామేషాలు ఎందుకు లెక్కిస్తోందో జవాబు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన సానుకూలతను వ్యక్తం చేసేందుకు ప్రకటనలు చేయడం మాని చేతల్లో చూపించి రెండు కార్పోరేషన్ ల ఏర్పాటుకు జీఓలు విడుదల చేయాల్సిందేని, మిగతా సామాజిక వర్గాల కార్పోరేషన్ లు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి వైశ్య, రెడ్డి కార్పోరేషన్ లను ఏర్పాటు చేయడంతో పాటు అన్ని కార్పోరేషన్ లకు రూ. 2,500 కోట్ల చొప్పున నిధులు కెటాయించాలని డిమాండ్ చేశారు. తక్షణం కార్పోరేషన్లను ఏర్పాటు చేయడంతో పాటు నిధులను కెటాయించనట్టయితే ఏఐఎఫ్బి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.