హుజూరాబాద్‌లో దారుణం.. అన్నంత పని చేసిన అమ్మాయి పేరెంట్స్‌

హుజూరాబాద్‌లో దారుణం..  అన్నంత పని చేసిన అమ్మాయి పేరెంట్స్‌
huzurabad news

చిన్ననాటి స్నేహం.. వస్తుంటే పోతుంటే చూపులు కలిశాయి. ఎదిగే కొద్దీ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది.. కాలేజీ బాటలో కబుర్లు, షికార్లు కామన్‌. అలా ఇద్దరూ ఇష్టపడ్డారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఇద్దరి అభిరుచులు ఒకటే. ఇంకేం పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యాడరు. కులమతాల గోల కూడా లేదు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. కానీ తప్పట్టు తాళాలు మోగాలంటే ఇరుకుటుంబాలు ఒప్పుకోవాలి కదా. చివరికి విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. కానీ, చప్పట్లు వచ్చేలా రెండు చేతులు కలవలేదు. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దాంతో ఈ ఇద్దరిలో టెన్షన్‌ నెలకొంది. అందర్నీ ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకోవాలనేదే వీళ్ల ఆలోచన. కానీ కథ మారింది. ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇటు అతను..అటు ఆమె.. తమ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. కట్‌ చేస్తే వేముల వాడ రాజన్న సన్నిధిలో రాజశేఖర్‌, సంజన పెళ్లయింది. కొత్త దంపతులుగా మారిపోయారు.ఈ ఇద్దరి పెళ్లయితే అయ్యింది కానీ, పెద్దలు ఆశీర్వదిస్తారా? యాగీ చేస్తారా? అనే డౌట్‌ ఉంది. దాంతో ముందు జాగ్రత్తగా హుజురాబాద్‌ పోలీసుల్ని ఆశ్రయించారు రాజశేఖర్‌, సంజన. పెద్దలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ దిశగా పోలీసులు చర్యలు చేపడుతున్న టైమ్‌లోనే.. ఒక్కసారిగా హుజురాబాద్‌ మార్కెట్‌యార్డ్‌ సవిూపంలో అగ్గి భగ్గుమంది. చూస్తుండగానే ఓ ఇల్లు ఇలా బుగ్గిపాలైంది. అమ్మాయి తరపు వాళ్లు ఇంటికి నిప్పటించారు. ఆ టైమ్‌లో ఇంట్లో ఎవరూ లేకపోవడం.. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పాట్‌కు చేరుకొని మంటలను ఆర్పడంతో ముప్పు తప్పింది. కానీ రాజశేఖర్‌ కుటుంబ సభ్యుల్లో ఇప్పటికీ ఆందోళన కొనసాగుతోంది. తమకు ప్రాణ భయంవుందని వాపోయారు అతని పేరెంట్స్‌. వార్నింగ్‌ ఇచ్చినట్టుగానే ఇల్లు కాలపెట్టారని.. ఇప్పుడు కట్టుబట్టలతో మిగిలామని వాపోతోంది రాజశేఖర్‌ కుటుంబం. తమకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు రాజశేఖర్‌`సంజన. తామిద్దరం మేజర్లమని..ఇష్టపూర్వకంగా ప్రేమపెళ్లి చేసుకున్నామన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు హుజురాబాద్‌ పోలీసులు. నిందితులపై చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.ఇటు హుజురాబాద్‌లో ఈ ఘటన సంచలనం రేపితే.. అటు వికారబాద్‌ జిల్లాలో మరో దారుణం వెలుగు చూసింది. దోమ మండలం ఐనాపూర్‌ గ్రామంలో ఓ యువతి, యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్లిద్దరూ ఊళ్లో నుంచి వెళ్లిపోయి ఎక్కడో ఉన్నారు. కానీ అమ్మాయి`అబ్బాయి కుటుంబాల మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మ్యాటర్‌ కేసుల దాక వెళ్లింది. తాజాగా అమ్మాయి తల్లి.. అబ్బాయి తల్లిపై నడిరోడ్డుపై దాడి చేయడం కలకలం రేపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితురాలు వాపోయింది. ఇక ఈ ఘటనలో మరో దారుణం ఏంటంటే.. దాడిని అడ్డుకోవాల్సిందిపోయి సినిమా చూసినట్టు చూశారు జనం. అంతేనా వీడియో తీస్తూ వికృతానందాన్ని ప్రదర్శించారట. ఇంత జరిగినా దోమ ఠానా నుంచి దోమ కుట్టినట్టుగానైనా రెస్పాన్స్‌ కన్పించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మరి దోమ పోలీసుల స్పందనేంటో.. ఈ ఘటనపై వారు ఎలాంటి యాక్షన్‌ చేపడుతారో వేచి చూడాలి.