పరస్పరం గౌరవించుకుంటేనే అభివృద్ధి

పరస్పరం గౌరవించుకుంటేనే అభివృద్ధి
  • మతాల మధ్య వివక్షతకు తావు లేదు
  • గణేష్ నిమజ్జనం, మిలాదున్ నభీ పండుగలను ఘనంగా నిర్వహించుకుందాం 
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ 
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :జిల్లాలో నిర్వహించుకోనున్న గణేష్ నిమజ్జనం మరియు  మిలాదున్ నబి పండుగలను సర్వ మతాల సమ్మిళితంతో  శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
  
శుక్రవారం  కలెక్టరేట్ ఆడిటోరియంలో గణేష్ నిమజ్జనం మరియు మిలాదున్ నబి పండుగల ఏర్పాట్లపై ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో  మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అందరి సహకారంతో ఈనెల 27న నిర్వహించనున్న గణేష్ నిమజ్జనాన్ని, 29న జరుపనున్న మిలాదున్ నబి పండుగలను విజయవంతం చేయడంలో సమిష్టిగా కృషి చేయాలని మంత్రి కోరారు.  ఇప్పటివరకు జిల్లాలో ఎటువంటి ఘర్షణలు జరగలేదని, అన్ని మతాలను సమానంగా గౌరవించుకోవడం జరిగిందని తెలిపారు.  జిల్లాలో అంగరంగవైభవంగా అద్యాద్మికతకు అద్దంపట్టేలా నిర్వహిస్తున్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో ముస్లిం సోదరులు పాల్గొని షర్బత్, స్వీట్లను పంచారని, అదేవిధంగా మిలాదున్ నబీ లో హిందువులు షర్బత్ లను పంచారని, ఇప్పటికి గ్రామాలలో జరిగే మొహరం పండుగను ముస్లింలతో సమానంగా హిందువులు కుడా నిర్వహించుకుంటారని,  చుట్టరీకాలను కూడా కలుపుకొని జీవిస్తారని, సర్వమతాలను గౌరవించుకున్నపుడే సమున్నత అభివృద్ధి సాధ్యం అన్నారు..  ఎక్కడ ఇప్పటివరకు శాంతి భద్రతలకు విఘాతం కలగలేదని, హైదరాబాద్ లో మిలాదున్ నబీ పండుగను పోస్టుపోన్ చేసుకున్నారని, అందుకు వారందరికీ ప్రభుత్వం పక్షాన కృతజ్ఞతాభినందనలను మంత్రి తెలిపారు.  బైబిల్, ఖురాన్, భగవద్గీత వంటి పవిత్ర గ్రంధాలలో ఎక్కడ మతాలను కించపరుస్తున్నట్లు చెప్పలేదని, తనమతాన్ని తాను గౌరవించుకుంటూ ఎదుటి వారి మతాన్ని గౌరవించినప్పుడే సమసమాజ స్థాపన జరుగుతుందని. ఎక్కడైతే శాంతి భద్రతలు బాగుంటాయో అక్కడ అభివృద్ధి ఆచరణ సాధ్యమవుతుందని తెలిపారు.  గతంలో జిల్లాలో డెంగ్యూ జ్వరాలతో అతలాకుతలమై, త్రాగునీటికోసం కొట్లాడే స్థితులుండే కరీంనగర్ జిల్లా హైదరాబాద్ తరువాత అభివృద్ది చెందిన నగరంగా ప్రగతి స్థానంలో నిలిచిందన్నారు.  వర్షాలు పడి వరదలతో కొన్ని నగరాలు మునిగిపోతుంటే కరీంనగర్ జిల్లాలో మాత్రం ఎటువంటి సమస్యలు తలెత్తలేదని, చారిత్రాత్మక చరిత్రను కలిగిన ఈ గొప్ప నగరాన్ని భవిష్యత్ తరాలకు కానుకగా అందించాలని తెలిపారు.   అల్లకల్లోలాలు ఉన్నచోట అభివృద్ది సాద్యపడదని, తెలంగాణలో శాంతియుత వాతావరణం నెలకొనడంతో అమెరికా వంటి దేశాలలో ఉండే గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు హైదరాబాద్ కు వస్తున్నాయని అన్నారు.
వినాయక నిమజ్జనం నాడు అధికారులందరు అప్రమత్తంగా ఉండాలని, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, సానిటేషన్ పనుల నిర్వహణ తదితర పనులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  జిల్లాలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల నిర్వాహకులు ఇబ్బందులు పడకుండా విద్యూత్ చార్జీలను చెల్లిస్తానని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాః బి. గోపి మాట్లాడుతూ, జిల్లాలో వినాయ నిమజ్జనానికి ఏర్పాట్లను చేయడం జరుగుతుందని, నిమజ్జనానికి వచ్చే విగ్రాహల ప్రకారం పర్యవేక్షించడానికి నోడల్ అధికారులను కూడా నియమించడం జరిగిందని తెలిపారు.  29న నిర్వహించే మిలాదున్ నభి  పండుగకు ప్రభుత్వ పరంగా సహకారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపి సుబ్బారాయుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై. సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీ కిరణ్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, గ్రందాలయ సంస్థ చైర్మన్ పొన్న అనీల్, యంపిపిలు శ్రీలత, లక్ష్మయ్య లు ఇతరం ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.