సీఎం కు విద్యారంగం పై సమీక్షించే సమయం లేదా

సీఎం కు విద్యారంగం పై సమీక్షించే సమయం లేదా

 బండి సంజయ్ యువతను రెచ్చగొట్టడం తప్ప చేసింది ఏమి లేదు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :విద్యారంగం సమస్యలు పరిష్కారం కొరకు సమీక్ష జరిపే సమయం ముఖ్యమంత్రికి లేదా అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. కరీంనగర్ లో ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో అధికారం లో ఉన్న బిఆర్ఎస్  ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరిస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడం లేదని విమర్శించారు. కరీంనగర్  ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  విద్యార్థి, యువతను మతాల పేరిట రెచ్చగొట్టడం తప్ప యువత కోసం చేసింది ఏమి లేదని విమర్శించారు.
  రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వ  పాఠశాలలు ,కళాశాలలు సమస్యలకి నిలయంగా మారాయని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న బోజన  పథకం హామీ ఇప్పటికీ అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు సంక్షేమ హాస్టల్స్   సొంత భవనాలు కనీస మౌలిక వసతులు లేవని మండిపడ్డారు. మెస్ ఛార్జీలు పెంపు లేదని, యూనివర్సిటీ విద్యార్థులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వెల్లడించారు. యూనివర్సిటీ ల అభివృద్ధికి సరిపడా నిధులు కేటాయించకుండా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్  పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని వ్యాఖ్యానించారు. పెండింగ్  లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీనీ అరికట్టడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్య బీటెక్ చదువుల కంటే ఎల్ కెజి, యుకెజి  చదువుల ఫీజులే ఎక్కువగా ఉన్నాయని  రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు,యూనివర్సిటీలు  అధికార పార్టీ ప్రజాప్రతినిధులవే అన్నారు.

వారే విద్య పేరుతో దోపిడీ చేస్తున్నా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్య పేద వారికి అందని ద్రాక్షగా మారిందని   సీఎం కెసిఆర్ కి పార్టీ,  ఓట్లు, సీట్ల పై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తున్నదని తెలంగాణ కి కేటాయించల్సిన విద్యాసంస్థలను కేటాయించకుండా నిర్లక్ష్యం చేస్తున్న  బీజేపీ ఎంపీ లు  ఎందుకు మాట్లాడటం  లేదని అన్నారు. బండి సంజయ్ కరీంనగర్ లో ఐఐఐటీ కేటాయింపు పై మాట్లాడకుండా, విద్యార్థి, యువతను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడపడం తప్ప విద్యార్థి యువత కోసం చేసింది ఏందో చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్రం నుండి ఐఐఐటి ,జిల్లాకో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఐఎం లాంటి అనేక విద్యాసంస్థలను తెలంగాణ లో ఏర్పాటు చేయాలని తెలంగాణ విభజన హామీ చట్టం చెప్పిన మోడీ ప్రభుత్వం గత 9సంవత్సరాల నుండి ఒక్క విద్యాసంస్థ కూడా తెలంగాణ కి కేటాయించలేదని అన్నారు  విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో    ముఖ్యమంత్రి కెసిఆర్ విద్యారంగం పై సమీక్ష నిర్వహించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో   రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను ఏకం చేసి  మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారుఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్, నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్,నాయకులు సందీప్ రెడ్డి,రాజేష్, బొల్లి సాయి,వినయ్ రెడ్డి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు