హుస్నాబాద్‌ తెరపైకి బీసీకార్డ్‌

హుస్నాబాద్‌ తెరపైకి బీసీకార్డ్‌
  • పొన్నం రాక వెనుక అదే అస్త్రం
  • ఒంటెత్తు పోకడలతో అలిగిరెడ్డి
  • ఎవరినీ పట్టించుకోవడం లేదన్న అపవాదు
  • ప్రవీణ్‌రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే గుస్సా..

చిగురుమామిడి ముద్ర న్యూస్: రానున్న ఎన్నికల్లో హుస్నాబాద్‌ అసెంబ్లీ బరి నుంచి కరీంనగర్‌ మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పొన్నం ప్రభాకర్‌ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.   హుస్నాబాద్‌ నుంచి బరిలో ఉంటున్నట్లు శుక్రవారం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంపై కన్నేసి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి తీరుపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉండడం.. ఆయన ఒంటెత్తుపోకడలకు వెళ్తున్నారని అపవాదు ఉండడం పొన్నం ప్రభాకర్‌కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు పార్టీ అధిష్టానం కూడా ప్రతి పార్లమెంట్‌ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయిస్తామని ప్రకటించడం కూడా పొన్నం రాకకు మార్గం సుగమంగా తెలుస్తోంది. 

 కాంగ్రెస్ పార్టీలో అంచలంచలుగా ఎదిగిన పొన్నం 
చదువుకునే రోజుల్లోనే ఎన్‌ఎస్‌యూసీ లీడర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన పొన్నం ప్రభాకర్‌... పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. ఎలాంటి గాడ్‌ఫాదర్‌ లేకునా‍్న.. సొంతంగా క్యాడర్‌ను సంపాదించుకున్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడంతో కరీం‍నగర్‌ నుంచి బరిలో నిలిచి ఎంపీగా ఎన్నికై సత్తా చాటారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆంధ్రానాయకులు పార్లమెంట్‌లో రభస సృష్టించగా.. వారిని దీటుగా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో పెప్పర్‌ స్ర్పే దాడులకు గురయ్యారు. ఆ సమయంలో ఆయన పేరు మారుమోగింది. బీసీ నాయకుడిగాను జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గం కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉండడం.. ఇక్కడ బీసీల సంఖ్య అధికంగా ఉండడం కూడా ఆయనకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే కలిసివచ్చే అవకాశముందని స్థానిక నాయకులు చర్చించుకుంటున్నారు. ఆయనను ఈ స్థానం నుంచి పోటీలో దించితే బీసీ కార్డుపై గెలిపించుకుంటామని కూడా నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.