పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం

పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
  • హిందూ ముస్లిం కలిసి ఉంటేనే అభివృద్ధి 
  • కోటి 25 లక్షల చెక్కుల పంపిణీ
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్


ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :పేదల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం మాదని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజవర్గం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలా ఉందో ప్రజలు ఆలోచించాలని అన్నారు.తెలంగాణ రాకమందు కరీంనగర్ ఉంది ప్రభుత్వాలు ఉన్నాయి సీఎం పీఎం లు ఉన్నారుకానీ తెలంగాణ రాకముందు కరీంనగర్ ఎలా ఉందో వచ్చిన తర్వాత ఎలా ఉందో ఆలోచించుకోవాలి అన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని, హిందూ ముస్లింల గొడవలతో శాంతిభద్రతలు లేకుండా పోతాయని పరిస్థితులు భయంకరంగా ఉంటాయని భయాందోళనకు గురి చేశారన్నారు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే బీదలకు సాయం చేయమంటూ సీఎం కేసీఆర్ నిరుపేదలకు మేలు చేసే బిసి సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రిగా నియమించారన్నారు. నిరుపేదలకు వెనుకబడిన వారికి సేవ చేసుకునే గొప్ప అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాకముందు నిరుపేదింటి ఆడబిడ్డల పెళ్లి చేసేందుకు ఆర్థిక ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉండేవి, అయినవారు సైతం ఓ చెయ్యి వేస్తానంటూ ముందుకు రాని రోజులు ఉండేవాని, అప్పు చేసి ఆడబిడ్డ పెళ్లి ఘనంగా నిర్వహించి చివరకు అప్పులు కట్టలేక భూములు అమ్ముకున్న  రోజులు ఉండేవని తెలిపారు.అలాంటి నిరుపేద యువతుల వివాహాలకు సీఎం కేసీఆర్ మేనమామగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో లక్ష రూపాయలు ఇస్తున్నారన్నారు. ప్రపంచంలోనే కల్యాణ లక్ష్మి ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. గత పాలకులకు కల్యాణ లక్ష్మి ఇవ్వాలనే ఆలోచన కానీ, మనసు కానీ వారికి రాలేదన్నారు. సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలు ఉండేవని,గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన రోజులు గుర్తున్నాయన్నారు. వాటర్ ట్యాంకర్ల వద్ద క్యూ కట్టిన రోజులు ఇంకా మరిచిపోలేదని తెలిపారు.

ఎల్ఎండిలో నీరు లేక నెర్రలువాసిన దుస్థితి ఉండేదని, రైతులు రాత్రివేళ పొలాలకు సాగునీరు పెట్టేందుకు అక్కడే పడుకుని. పాముకాట్లకు గురై మృతి చెందేవారని అన్నారు. కానీ స్వయం పాలనలో సమస్యలన్నింటినీ పరిష్కరించామని తెలిపారు. రెప్పపాటు కూడా కరెంటు పోవడం లేదని,కాలేశ్వరం జలలతో ఎల్ఎండి సంవత్సరాంతం నిండుగానే ఉంటుందని అన్నారు. సమైక్య పాలనలో కరీంనగర్లో రోడ్లు వేయాలన్న ఆలోచన అప్పటి పాలకులకు రాలేదని, డ్రైనేజీలు సరిగ్గా లేక పందుల సంచారంతో దుర్గంగాధాన్ని వెదజల్లేవన్నారు.ఇప్పుడు స్వయంపాలనలో కరీంనగర్లో రోడ్లన్నింటిని సుందరంగా తీర్చిదిద్దామని, డ్రైనేజీలను గొప్పగా నిర్మించాం అన్నారు.పేదల కోసం పనిచేసే ప్రభుత్వం మాదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టి తమాషా చూసేవారని,హిందూ ముస్లింలు కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అన్నారు. కెసిఆర్ పాలనలో శాంతిభద్రతలు భేషుగ్గా ఉన్నాయని, శాంతి భద్రతలు లేని చోట అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలని గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాం, ఈనెల 16వ తేదీ నుండి మైనారిటీలకు,  బీసీ కులాలకు చేయూతను కూడా అందిస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో స్కాములు ఉంటే కేసీఆర్ పాలనలో స్కీములు అమలవుతున్నాయన్నారు.కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్ లు కరీంనగర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు.ఈ సందర్భంగా 125 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 1కోటి 25 లక్షల14 వేల500 రూపాయల విలువ గల చెక్కులను మరియు అతి లబ్ధిదారునికి చీరను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, ఆర్డీవో మహేశ్వర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, చల్ల హరి శంకర్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.