కంపు కొడుతున్న చంద్రపురి కాలనీ

కంపు కొడుతున్న చంద్రపురి కాలనీ

సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం

ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1 వ డివిజన్ లో గల చంద్రపురి కాలనీలో సిపిఎం నగర కమిటీ పర్యటించింది. మురికి కాలువలు పాడై మురుగునీరు ఇండ్లలోకే రావడంతో చంద్రపురి కాలనీ కంపు కొడుతుందని  సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. గత 24 సంవత్సరాలుగా చంద్రపురి కాలనీలోని పేదలు,కార్మికులు సరైన డ్రైనేజీ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్మార్ట్ సిటీగా ఎంపికైన కరీంనగర్ లో విలీన గ్రామాలను విస్మరించారని, బడుగు బలహీన వర్గాలు పేదలు అధికంగా ఉన్న వాడలను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.నగర ప్రజల ముక్కు పిండి పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ సౌకర్యాలు కల్పించడంలో లేదని అన్నారు. గతంలో టెంపరరీగా ఉన్న డ్రైనేజీ నీరు రైల్వే స్థలంలోకి వెళ్లేదని, రైల్వే అధికారులు మురికి కాలువలకు అడ్డుకట్ట వేయడంతో ఆ నీరు అంతా పేద ప్రజల ఇండ్లలోకి వచ్చి దుర్గంధం వెదజల్లుతుందని అన్నారు.

అసలే జ్వరాల సీజన్, ఆపై మురుగునీరు రావడంతో ఇంటికి ఒకరు మంచాన పడుతున్నటువంటి దుస్థితి ఉందని వెల్లడించారు. అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని దోమలు, పందులు స్వైప్త విహారం చేస్తున్నాయని, డెంగ్యూ ప్రబలుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే 60 కుటుంబాలను తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యు.శ్రీనివాస్, నగర కమిటీ సభ్యులు పున్నం రవి, కొంపల్లి సాగర్,చంద్రపురి కాలనీ ప్రజలు జి. సుధీర్,కిషన్,శంకరయ్య, వజ్రమ్మ,లక్ష్మి ,రాజేశ్వరి, రాము,శారద,సుగుణ తదితరులు పాల్గొన్నారు.