జీఎస్టీ వసూళ్లు రూ.1.62లక్షల కోట్లు

జీఎస్టీ వసూళ్లు రూ.1.62లక్షల కోట్లు
  • సెప్టెంబర్​లో రికార్డు స్థాయిలో పన్ను  వసూలు
  • మహారాష్ర్ట టాప్, బిహార్ లాస్ట్​ 

న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూలైంది. సెప్టెంబర్​కు సంబంధించి రూ.1.62 లక్షల కోట్లు వసూలయ్యాయి. రూ.1.60 లక్షల కోట్లు దాటడం ఇది నాలుగోసారి. జీఎస్టీ రెవెన్యూ మందగించిన ఏకైక రాష్ట్రం బిహార్. 2023–24 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెలకు జీఎస్టీ  వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. మొత్తం రూ.1,62,712 కోట్లుగా నమోదైంది. దీంట్లో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.29,818 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్​జీఎస్టీ ) రూ. 37,657 కోట్లు. ఐజీఎస్టీ రూ.83,623 కోట్లు. సెస్ రూ.11,613 కోట్లు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2022–23 సెప్టెంబర్‌లో జీఎస్టీ  వసూళ్లు మొత్తంగా రూ.1.47 లక్షల కోట్లుగా ఉంది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో ఏకంగా 10 శాతానికిపైగా వసూళ్లు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 శాతం వృద్ధి నమోదైంది. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్- సెప్టెంబర్) వరకు చూస్తే స్థూల జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.9,92,508 లక్షల కోట్లుగా ఉంది. 

అధిక పన్ను మహారాష్ట్ర నుంచి..

సెప్టెంబర్ నెలలో ఎక్కువ జీఎస్టీ  వసూళ్లు సాధించిన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇక్కడ ఏకంగా రూ.25,137 కోట్లు రాగా.. అంతకుముందు సెప్టెంబర్‌తో పోలిస్తే 17 శాతం పెరిగింది. కర్ణాటకలో 20 శాతం పెరిగి రూ. 11,693 కోట్లుగా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉంది. ఏకంగా ఈసారి 33 శాతం వృద్ధి నమోదవడం విశేషం. 2022-–23 సెప్టెంబర్‌లో జీఎస్టీ  వసూళ్లు తెలంగాణలో రూ.3,915 కోట్లు కాగా.. ఇప్పుడు అది రూ.5,226 కోట్లుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు రూ.3,132 కోట్లు ఉండగా.. ఈసారికి రూ.3658 కోట్లకు చేరింది. 17 శాతం వృద్ధి నమోదైంది.13 కోట్ల జనాభా ఉన్న బిహార్‌లో జీఎస్‌టీ వసూళ్లు భారీగా పడిపోయాయి. ఈసారి 5 శాతం వసూళ్లు తగ్గాయి.