ఘనంగా చక్రతీర్థం, మహాపూర్ణాహుతి

ఘనంగా చక్రతీర్థం, మహాపూర్ణాహుతి


ముద్ర ప్రతినిధి భువనగిరి :  యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవములలో బుధవారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయ ప్రధానార్చకులు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎ. భాస్కర్ రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. 


మహా పూర్ణాహుతి ప్రత్యేకత
సమస్త లోకములు సుఖశాంతి మయములు కావాలని, లోకములో సువృష్టి కలిగి సస్యశామలం కావాలని ఎంతో భక్తిభరితముగా ఈ వేడుక నిర్వహిస్తారు. ఉత్సవములలో ప్రతినిత్యం నిర్వహింపబడిన హవనములు, మూలమంత్ర, మూర్తిమంత్ర జపములు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యత అని సంకల్పించి పూర్ణాహుతి ఫలమును భగవదర్పణము గావించుచూ ఈ పూర్ణాహుతి వేడుక నిర్వహించారు.


శ్రీ చక్రతీర్ధము 
దీక్షాన్తోవభృధోయజ్ఞే అని శాస్త్రము ఉత్సవాంతమందు న్యూన, అతిరిక్త దోష పరిహారం కోసం చేసే విశిష్ఠప్రక్రియే ఈ చక్రతీర్ధము. దీనినే అవభృధోత్సవమని కూడా అంటారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వారును వేంచేపు చేసి పంచామృతస్నపన, తిరుమంజన ఉత్సవము నిర్వహించి శ్రీ స్వామి వారి పుష్కరిణిలో పవిత్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవములలో ప్రతినిత్యము ఆహ్వానితులైన దేవ, ఋషిగణములను, విచ్చేసిన భక్తులను ఎల్లవేళల కాపాడుతూ దుష్టశక్తుల నుండి రక్షిస్తూ తనధర్మాన్ని నిర్వహించినందులకు గాను కృతజ్ఞతా పూర్వకముగా ఈ వేడుక చేశారు. అవభృధ స్నానం వలన సర్వపాప విముక్తులై విష్ణులోకాన్ని పొందుతారని వేదోక్తి.


సాయంకాల కార్యక్రమములు
బుధవారం సాయంకాలం శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం కార్యక్రమములను ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆర్చకబృందం, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా నిర్వహించారు. 


శ్రీ పుష్పయాగము 
బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వేడుకలలో అత్యంత ఫలప్రదాయకమైనది శ్రీ పుష్పయాగం. అనేక విధములైన పుష్పములతో భగవానుని అనేక నామములను స్మరించుచూ భక్తిపూర్వకముగా శ్రీ స్వామి అమ్మవారలకు సమర్పించుట ఎంతో విశేషమైయున్నది. భక్తిపూర్వకముగా పత్రము గాని, పుష్పము గాని సమర్పించిన అది తనకు అత్యంత సంతోషము కలిగించునని భగవదుక్తి, ఉత్సవములలో తెలిసి తెలియక జరిగిన సర్వవిధ లోపములను క్షమించమని ప్రాయశ్చిత్త పూర్వకంగా ఈ వేడుక నిర్వహించారు.


దేవతోద్వాసన ప్రత్యేకత
బ్రహ్మోత్సవాలకు విచ్చేసి భక్తకోటిని అనుగ్రహించిన సమస్త దేవగణమును తిరిగి వారిని సభక్తిపూర్వకముగా స్వస్థలములకు పంపించుటయే దేవతోద్వాసన వేడుక. భక్తిశ్రద్ధలతో, వైదిక మంత్ర పఠనములతో దేవతోద్వాసన వేడుక నిర్వహించుట ఆగమశాస్త్ర ప్రసిద్ధమైయున్నది.

దోపు ఉత్సవము 
తిరుమంగయాళ్వార్ అను పరమభక్తుడు భగవత్సేవకన్నా భాగవత తదియారాధన మిన్న అని తలచి తన సర్వస్వమును వెచ్చించి తదియారాధన నిర్వహించాడు. తదియారాధనకు సంపద సరిపడక అమ్మవారి ఆభరణములు దొంగిలించుటకు ప్రయత్నించి అమ్మవారి పాద మెట్టెలను నోటితో స్పృశించగా జ్ఞానం కలిగి భగవత్ భక్తిలో కడతేరిన వృత్తాంతమే ఈ దోపు ఉత్సవం. త్రీకరణ శుద్ధిగా భగవదర్పణ బుద్ధితో మనము ఆచరించే కర్మలు గాని, దాన ధర్మములు గాని పరమాత్మ స్వీకరించగలడని ఈ వేడుకలోని అంతరార్ధం.

సాంస్కృతిక కార్యక్రమాలు
బుధవారం ఉదయం వీరప్రతాప భజన మండలి, పాండురంగ భజన మండలి, గాయత్రి మహిళా భజన మండలి వారు భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి.  అనంతరం భాస్కరభట్ల ఆంజనేయ శర్మ  వామన అవతార వైభవంపై  ఉపన్యాసమిచ్చారు. తిరుమంగయాళ్వార్ చరిత్రను లక్ష్మీనారాయణ భాగవతార్  హరికధాగానం చేశారు.  సాయంకాలం ఎస్.నాగజ్యోతి, కౌటూరి గాయత్రిలు భక్తి సంగీత కార్యక్రమాలు, పద్మజ  కర్ణాటక సంగీతం, మాహ్నిత  కూచిపూడి నృత్యప్రదర్శన చేశారు శోభరాజు ప్రముఖ సంగీత గాయకురాలు గారిచే సంగీత కచేరి నిర్వహించారు. జ్వాలాముఖి కూచిపూడి నృత్యం చేశారు. అనంతరం రిషి డాన్స్ అకాడమి వారు పేరిణి నృత్యం, ఆస్థానం వారు మంగళవాయిద్య గోష్ఠి కార్యక్రమము అనంతరం ధార్మిక సాహిత్య సంగీత సభల ముగింపు కార్యక్రమములో ఆలయ అధికారులు పాల్గొన్నారు.