కరీంనగర్ లో హై టెన్షన్

కరీంనగర్ లో హై టెన్షన్
  • కరీంనగర్ టూ టౌన్ లో బండి పై కేసు నమోదు
  • పేపర్ లీక్ బిజెపి కుట్రే అంటున్న గంగుల
  • సంజయ్ కు 14 రోజుల రిమాండ్
  • ఖమ్మం జైలుకు తరలింపు

  • డైవర్షన్ పాలిటిక్స్ అంటున్న బిజెపి

ముద్ర ప్రతినిధి కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో కరీంనగర్ లో హై టెన్షన్ నెలకొంది. పదవ తరగతి హింది ప్రశ్న పత్రం లీక్ లో సంజయ్ ప్రమేయం ఉందంటూ మంగళవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేసి బొమ్మలరామారం కు తరలించారు. బుధవారం కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 151 కింద బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పదవ తరగతి ప్రశ్న పత్రం లీక్ అయ్యాయి అంటూ మీడియాకు సోషల్ మీడియా లో ప్రచారం, విద్యార్థుల్లో గందరగోళం నెలకొల్పారంటూ అందులో పేర్కొన్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బిఆర్ఎస్ బిజెపి మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ధర్నాలు నిరసనలతో కరీంనగర్ దద్దరిల్లుతుంది. మంగళవారం అర్ధరాత్రి బండి సంజయ్ ను అరెస్టు చేసినప్పటి నుండి బుధవారం అర్ధరాత్రి వరకు  రాజకీయ హై డ్రామా కొనసాగింది. సంజయ్ ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారో కనీస సమాచారం పోలీసులు ఇవ్వలేదని బండి సంజయ్ సతీమణి అపర్ణ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కుటుంబ సభ్యులు ఆందోళనల చెందుతున్నారు.

ఇది ఇలా ఉండగా బండి అరెస్టుకు నిరసనగా కరీంనగర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో నల్ల జెండాలతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వివాదం తోపులాట జరిగింది. బిజెపి అధిష్టానం సంజయ్ కి సంఘీభావంగా ఉండాలంటూ కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా నేడు ప్రతిజ్ఞ   కార్యక్రమంలో పాల్గొనాలని బిజెపి శ్రేణులకు అధిష్టానం పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలను మభ్య పెట్టాలని బీజేపీ ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బిజెపి కుట్ర పన్నుతుందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్ లో బండి సంజయ్ ప్రమేయం ఉండడంతోనే పోలీసులు అరెస్టు చేశారని వెల్లడించారు. పచ్చని తెలంగాణలో బిజెపి చిచ్చు పెట్టాలని చూస్తుంది అని మంత్రి అంటున్నారు. లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాడు అని మండిపడ్డారు. తెలంగాణలో బీహార్ సంస్కృతి కి బీజం వేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ పక్కకు పోయి బిజెపి వర్సెస్ బిఆర్ఎస్ లా మారిపోయింది. టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ఏ వన్ ముద్దాయిగా బండి సంజయ్ ని చేర్చారు అనంతరం హనుమకొండ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. భారీ బందోబస్తు మధ్య ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో కరీంనగర్ లో ఎప్పుడు ఏమి జరుగుతోందో అన్న ఆందోళన నెలకొంది.