రాష్ట్రానికి మెగా పెట్టుబడి

రాష్ట్రానికి మెగా పెట్టుబడి
  • ఎలక్ట్రానిక్​ దిగ్గజ సంస్థతో ఒప్పందం
  • లక్ష మందికి ఉపాధి అవకాశాలు
  • సీఎం కేసీఆర్ తో  ‘ఫాక్స్ కాన్ ’ ప్రతినిధుల భేటీ

ముద్ర, తెలంగాణ బ్యూరో:  తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి అమలు చేయడంతో ప్రపంచ దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో  భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది  ప్రభుత్వ విజయమని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్​ఉత్పత్తిలో ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన ‘Hone High Fox Con  ‘హోన్ హై ఫాక్స్ కాన్ ’ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఏర్పాటు చేసే కంపెనీలో దాదాపు లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు ప్రకటించింది.  సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ  నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతిభవన్ లో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి దొరుకుతుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి సంస్థ  ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. కంపెనీ ద్వారా లభించే లక్ష ఉద్యోగాలను సాధ్యమైనంతవరకు తెలంగాణ యువతకు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడులలో ఇది ముఖ్యమైనదని, ఇందుకు సహకరించిన సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ భవిష్యత్తు విస్తరణ ప్రణాళికల మీద కూలంకషంగా చర్చించారు. సంస్థ కార్యకలాపాలకు అన్ని రకాల సహాయ సహాకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. 

ఆశావహ దృక్పథంతోనే
ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ ల్యూ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందన్నారు. ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణంపై  ప్రశంసలు కురిపించారు. ఎనిమిది సంవత్సరాలలోనే  తెలంగాణ రాష్ట్రం, పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా ఐటీ, అనుబంధ ఎలక్ట్రానిక్స్ రంగాలలో సాధించిన అభివృద్ధి పైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ తమ సంస్థ పెట్టుబడుల విషయంలో ఆశావాహ దృక్పథంతో ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో  మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు రామకృష్ణారావు, అర్వింద్ కుమార్, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, డైరక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు. గురువారం యంగ్ ల్యూ’ పుట్టిన రోజు కావడంతో  స్వదస్తూరితో  ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్ కార్డును సీఎం కేసీఆర్ స్వయంగా ఆయనకు అందజేశారు.