సమాజంలో భక్తి పెరిగితే దోపిడి పోతుంది: ఎమ్మెల్యే పోచారం

సమాజంలో భక్తి పెరిగితే దోపిడి పోతుంది: ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, ముద్ర: సమాజంలో భక్తి పెరిగితే దుర్మార్గం, దోపిడీ పోతుందని, మానవత్వం పెరుగుతుందని బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి మందిరం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని భక్తివాడగా మార్చడానికి ప్రతి గ్రామంలో, తాండాలో దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేశానన్నారు. గత పది సంవత్సరాలలో బాన్సువాడ నియోజకవర్గంలో దేవాలయాలు, సన్నిధానాల నిర్మాణానికి మొత్తం రూ. 150 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశానని అన్నారు. ప్రజలు అడిగిన నిధుల కంటే ఎక్కువ మొత్తం మంజూరు చేశానని, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్  ఇచ్చిన రూ. 500 కోట్ల ప్రత్యేక నిధులతో నియోజకవర్గంలో ప్రజలు అడిగిన అన్ని పనులను కాదనకుండా ఇచ్చానని అన్నారు.


బహుశా బాన్సువాడ నియోజకవర్గంలో జరిగినంత అభివృద్ధి పనులు రాష్ట్రంలో ఎక్కడా జరగలేదన్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన రోడ్లు, విద్యాలయాలు, సామాజిక భవనాలు, త్రాగునీరు,  దేవాలయాలు, మౌళిక వసతులు ఇలా అన్ని కూడా కల్పించానని అన్నారు.గత శాసనసభ ఎన్నికలలో విజయం సాధించినా  అనుకున్నంత మెజారిటీ రాలేదని, ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసినా భారీ మెజారిటీ రాలేదని కొంత బాధ పడ్డానని అన్నారు. కోట్ల రూపాయలతో రోడ్లు వేయించానని,. కేజ్ వీల్స్ తిరగడంతో రోడ్లు పాడవుతున్నాయని, రోడ్లపై కేజ్ వీల్స్ తిప్పవద్దని,. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండని అన్నారు.