తగ్గేదేలె- పుంజుకుంటున్న 'బిజెపి'..

తగ్గేదేలె- పుంజుకుంటున్న 'బిజెపి'..
  • స్పీడ్ పెంచిన 'కారు'..
  • ఆశల పల్లకిలో 'హస్తం'
  • భూపాలపల్లిలో మారుతున్న బలాబలాలు..
  • ఉత్కంఠగా సాగుతున్న ఎన్నికల పరిణామాలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు తగ్గేదేలే అన్నట్లుగా ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నారు. పోటాపోటీగా గ్రామాలను చుట్టుముడుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో బిజెపి రోజురోజుకు పుంజుకుంటుంది. ప్రధాన పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు రోజువారి షెడ్యూల్ పెట్టుకొని విరామము లేకుండా ప్రచారాలకే ప్రాధాన్యమిస్తున్నారు. గ్రామ గ్రామాన గడపగడపకు తిరుగుతూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఆయా గ్రామాల ముఖ్య కూడళ్ల వద్ద కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేసి ప్రత్యర్థుల ఆగడాలను ఎండగడుతూ, గెలిస్తే పనిచేసే విధానాలను వివరిస్తూ, ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలు సమీపిస్తుండడంతో అభ్యర్థుల గుండెల్లో మాత్రం గుబులు కనిపిస్తుంది. అయినప్పటికీ ఎవరికి వారు తామే గెలుస్తామనే గాంభీర్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. గడిచిన రెండు వారాల్లో రాజకీయ బలాబలాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా పార్టీల్లో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయినా గెలుస్తామనే ధీమాతో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ముందడుగు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే పట్టుదలతో అభ్యర్థులు తమదైన శైలిలో చక్రం తిప్పుతూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆయా మండలాల్లో తమ పరిస్థితులు ఎలా ఉంటాయని అంచనా వేస్తూ, గెలుపు పై ఆశలను పెంచుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.

స్పీడ్ పెంచిన కారు..

భూపాలపల్లి నియోజకవర్గంలో కారు స్పీడ్ పెంచింది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, సిరికొండ మధుసూదనాచారిలతో ప్రచారాలు నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. మధుసూదనాచారి భూపాలపల్లి టికెట్ ఆశించి భంగపడినప్పటికీ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల సూచన మేరకు పార్టీకి నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో గండ్ర వెంకటరమణారెడ్డి ని గెలిపించేందుకు తనవంతుగా ఈ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. తన వర్గీయులు అందరు వెంకటరమణారెడ్డికే మద్దతుగా ప్రచారం చేయాలని, భూపాలపల్లిలో బిఆర్ఎస్ ను గెలిపించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, వరంగల్ జడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి,  వారి కూతురు కోడలు ప్రియాంక రెడ్డి, వైశాలిని రెడ్డి లు ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాలు నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మరోవైపు వెంకటరమణారెడ్డి కుమారుడు, జిఎంఆర్ఎం ట్రస్ట్ నిర్వాహకులు గౌతమ్ రెడ్డి పార్టీ మంచి చెడులను చూస్తూనే, వివిధ పార్టీలో ఉన్న అసంతృప్తి వాదులను బిఆర్ఎస్ పార్టీలో చేర్పించుకుంటూ ప్రచారాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. దీంతో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచినట్లు అయింది. ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ఎన్నికల్లో ఎలాగైనా తానే గెలుస్తానని ధీమాతో బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ముందుకు సాగుతున్నారు. 

పుంజుకుని వికసిస్తున్న కమలం..

భూపాలపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు చాపకిందనీరులా పుంజుకుంటుంది. ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తిరెడ్డి ప్రచారంలో దూకుడు పెంచడంతో ఆయా గ్రామాల్లో బిజెపి బలోపేతం అవుతుంది. ఆమె చేపడుతున్న కార్యక్రమాలతో బిజెపికి ఓటు బ్యాంకు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ గ్రామాన బిజెపికి స్పందన అనుకూలంగా లభిస్తుండడంతో గెలుపుపై పట్టు బిగిస్తున్నారు. రోజురోజుకు కార్యక్రమాలను విస్తృత పరుస్తూ, గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, కార్నర్ మీటింగ్ లలో ప్రత్యర్థులను ఎండగడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను వివరిస్తూనే, ఒక ఆడబిడ్డగా ఆశీర్వదించాలని భూపాలపల్లి గడ్డపై మహిళకు అవకాశం కల్పించాలని సెంటిమెంటును ఎరగా వేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. రోజురోజుకు ఆదరణ పెరుగుతూ వస్తుండడంతో గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేసేలా ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భూపాలపల్లిలో బిజెపి గెలిచినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని, ఆ పార్టీ బలోపేతం అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆశలపల్లకిలో ఎదురీదుతున్న హస్తం..

ఆశల పల్లకిలో హస్తం ఎదురీదుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీనే నని ఆ పార్టీ ఎదగడంతో, అదే తరహాలో భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గాలి పెరిగింది. అంచెలంచెలుగా కాంగ్రెస్ బలోపేతం అయినప్పటికీ, పార్టీ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు గెలుపుకు బాటలు వేసుకోవడంలో కొంత అనిశ్చితి నెలకొంది. పార్టీ పరంగా బలోపేతమైనప్పటికీ, ప్రచారంలో విరామం ఎరుగకుండా గ్రామాలను చుట్టుముడుతున్నప్పటికీ, ఆర్థిక వనరుల లేమితో కొంత ఇక్కట్లకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ కార్యక్రమాలకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సొంతంగా భరించుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూసిన గండ్ర సత్యనారాయణ రావు సానుభూతి ఓట్లతో గెలుస్తానని ఆశల పల్లకిలో ఊగుతున్నారు. అదే ధీమాతో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణి గణపురం జడ్పిటిసి గండ్ర పద్మ, వారి కూతుర్లు కూడా గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్ అలియాస్ ఐతు కాంగ్రెస్ పార్టీలో చేరి సత్యనారాయణరావుకు అండగా ఉండడం, మరోవైపు రిటైర్డ్ పోలీస్ అధికారి కటంగూరి రామ్ నర్సింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అండగా నిలవడంతో కాంగ్రెస్ పార్టీకి కొంత బలాన్నిస్తుంది. ఈ క్రమంలో ఆరుగ్యారెంటీల పథకాన్ని ఎరగా వేస్తూ, ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతంగా ఉన్నప్పటికీ అన్ని రంగాల్లో దూకుడు ప్రదర్శించి గెలుపు వైపు పరుగెత్తాల్సిన సమయంలో అశ్రద్ధ వహించడం ఏ వైపుకు దారితీస్తాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళుతుందో వేచి చూడాల్సిందేనని రాజకీయ మేధావులు చర్చించుకుంటున్నారు. 

మారుతున్న రాజకీయ పరిస్థితులు..

భూపాలపల్లి నియోజకవర్గంలో ఏరోజుకారోజు రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ పార్టీ దిగుతారో.. ఏ పార్టీ ఎక్కుతారో.. తెలియని పరిస్థితి ఏర్పడింది. నిలకడ లేని పార్టీ నాయకులు, కార్యకర్తలతో అభ్యర్థులకు తలనొప్పి ఎక్కువైంది. భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటనతో బిఆర్ఎస్ పార్టీ బలోపేతంగా కనిపించినప్పటికీ, రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ వైపు గాలి వీచింది. దీంతో ఆ పార్టీలో చేరికల జోష్ పెరగడంతో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అనుకునే స్థాయిలో పరిస్థితులు కనిపించాయి. కానీ గత రెండు వారాల తరువాత బిఆర్ఎస్ పార్టీ ముందంజలోకి వచ్చి చేరినట్లు అయింది. అన్ని రంగాల్లోనూ దూకుడు పెంచి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే, మూడో స్థానంతో సరిపెట్టుకుంటుందని అనుకుంటున్న బిజెపి అనూహ్యంగా రెట్టింపు స్థాయిలో పుంజుకొని ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈసారి తగ్గేదేలే అన్నట్లుగా చందుపట్ల కీర్తి రెడ్డి గెలుపు పై ఆశలు పెట్టుకుని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలైన బిజెపి, బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.