పోడు దరఖాస్తుదారులందరికీ పట్టాలందించాలి

పోడు దరఖాస్తుదారులందరికీ పట్టాలందించాలి
  • మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
  • కాటారంలో ఐదు మండలాల గిరిజన రైతులకు పోడు భూముల పట్టాల పంపిణీ

ముద్ర న్యూస్,కాటారం:గత 60 ఏళ్లుగా పోడు చేసుకుని భూములు దున్నుకొని జీవిస్తూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న కుటుంబాల అందరికీ పట్టాలు అందించాలని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.జిల్లాలో 18 వేల దరఖాస్తులు అందిస్తే స్క్రూటీని పేరుతో అధికారులు మూడువేల మంది గిరిజనులకే పట్టాలు అందించడం దారుణమైన విషయమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు కాటారం మండల కేంద్రంలో శుక్రవారం మహా ముత్తారం, మహాదేవపూర్,పలిమెల, మలహర్,కాటారం మండలాలకు చెందిన గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ 2005లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నాయకత్వంలో అటవీ భూములపై హక్కు ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు. ఆ చట్ట పరిధిలోని మంథని నియోజకవర్గంలో పోడు భూములు దున్నుకొని జీవిస్తున్న 6,000 మంది రైతులకు హక్కు పత్రాలు అందించామని పేర్కొన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు హక్కు పత్రాలు పొందిన భూములను స్వాధీనం చేసుకొని పేద రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.60 ఏళ్లుగా పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న రైతులు ప్రస్తుతం అక్కుపత్రాలు తో అధికారులకు దరఖాస్తులు సమర్పించితే కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం విడ్డూరమన్నారు. పోడు భూములపై పట్టాలు పొందిన గిరిజనులకు గిరి వికాస్ పథకం కింద బోరు బావులు తవ్వించి విద్యుత్ సౌకర్యం కల్పించి సాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు అలాగే ఆ భూములకు అనువైన పంటలను వేసే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు.

పట్టాదారు పాస్ పుస్తకాలతో సర్వహక్కులు లభిస్తాయి - జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

పోడు భూములు దున్నుకుంటున్న గిరిజన రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలతో సర్వహక్కులు లభిస్తాయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. విజయాలకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు, రైతు బీమా వర్తించడమే కాకుండా బ్యాంకుల్లో పంట రుణాలు కూడా పొందవచ్చని అన్నారు.అలాగే గిరి వికాస్ పథకం కింద బోరుబావులు తవ్వించి విద్యుత్ సౌకర్యం,కరెంటు మోటారు ఉచితంగా అందిస్తామన్నారు. దాంతోపాటు వారసత్వంగా భూములు బదిలీ అవుతాయన్నారు.ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం అభివృద్ధి కోసం పోటు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లాలో దరఖాస్తు దారులను పూర్తిగా సర్వే నిర్వహించి పారదర్శకంగా పట్టాల పంపిణీ నిర్వహించామన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు-జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణి

దశాబ్దాలుగా గిరిజనులు ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజన కుటుంబాల తరఫున జెడ్పి చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లుగా కోడిబొమ్మలపై హక్కు లేకపోవడంతో అటవీశాఖ అధికారులు గిరిజనులను చాలా ఇబ్బందులకు గురి చేశారని ప్రభుత్వం చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమంతో గిరిజనుల ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయాయని సంతోషం వెలిబుచ్చారు.ఇంకా పట్టాలందని మిగిలిన గిరిజన కుటుంబాలకు కూడా పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఐటిడిఏ పిఓ అంకిత్, జిల్లా పరిషత్ సీఈవో విజయలక్ష్మి, ఎంపీపీలు పంతకాని సమ్మయ్య, మలహాల్ రావు,బన్సోడ రాణిబాయ్,జెడ్పిటిసిలు గుడాల ఆహారం అరుణ లింగమల్ల శారద, మార్కెట్ కమిటీ చైర్మన్ పెండ్యాల మమత మనోహర్,,పీఏసీఎస్ చైర్మన్లు చల్ల నారాయణరెడ్డి మల్క ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.