పాక్​లో చుక్కలను తాకుతున్న ద్రవ్యోల్బణం

పాక్​లో చుక్కలను తాకుతున్న ద్రవ్యోల్బణం
Inflation in Pakistan

ఇస్లామాబాద్‌: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం చుక్కల్ని తాకుతోంది. 50 సంవత్సరాల గరిష్ఠానికి చేరింది.  ఫిబ్రవరిలో వినియోగ ధరల సూచీ 31.5 శాతానికి చేరిందని పాకిస్థాన్‌ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్  వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ లీటర్ డీజిల్ ధర రూ. 280కి చేరింది. ఇక పది గ్రాములు బంగారం  ధర అనూహ్యంగా పెరిగిపోయింది. 24 క్యారెట్ల మేలిమి పసిడి ధర 2.06 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరిందని అక్కడి మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. మరోవైపు, పాక్‌ కరెన్సీ విలువ దారుణంగా పడిపోతోంది. ద్రవ్యోల్బణ కారణాలను చూపుతూ గురువారం అక్కడి కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 300 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దాంతో రుణ వడ్డీ రేటు 20 శాతానికి చేరింది.

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ అప్పు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. రుణం ఇవ్వడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి  విధించిన షరతులకు ఇటీవలే తలొగ్గింది. బడ్జెట్‌ లోటును తగ్గించుకొని నికర పన్ను వసూళ్లను పెంచుకోవడమే లక్ష్యంగా ఇటీవల మినీ బడ్జెట్‌ను ఆవిష్కరించింది. ఫారెక్స్‌ నిల్వలు సరిపడా లేకపోవడంతో అత్యవసర ఔషధాలు/ దేశంలో ఉత్పతి చేసే ఇతర మెడిసన్‌ ముడి సరకును సైతం దిగుమతి చేసేకోలేక పాక్‌  విలవిలలాడుతోంది. దీంతో స్థానిక ఔషధ తయారీ కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో ఆస్పత్రుల్లోని రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మందులు, వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు శస్త్రచికిత్సల్ని నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇక నిత్యావసరాల కోసం ప్రజలు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగి మరణాలూ చోటుచేసుకున్నాయి.