శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో దారుణం..

శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో దారుణం..

- యజమాన్య వేధింపులు భరించలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

- కేశంపేట మండలం కొత్తపేటలో విషాదఛాయలు..

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:నార్సింగి శ్రీ చైతన్య కాలేజ్ లో దారుణం చోటుచేసుకుంది కళాశాల యజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యుల తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నాగుల రాజు కుమారుడు సాత్విక్(16) ని నార్సింగిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చేర్పించారు. కళాశాల ప్రిన్సిపల్ వార్డెన్ ఎక్కువ వేధింపులు తట్టుకోలేక రాత్రి 10:30గంటలకు స్టడీ అవర్స్ అయిపోయాక విద్యార్థులందరూ హాస్టల్ గదికి చేరుకున్నారని, కానీ సాత్విక్ మాత్రం హాస్టల్ కు వెళ్లకుండా క్లాస్ గదిలోనే బట్టలు ఆరవేసే వైరుతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడన్నారుడ.

ఈ దారుణం గమనించిన కొందరు విద్యార్థులు గట్టిగా అరవడంతో వార్డెన్ సంఘటన స్థలానికి వచ్చాడని కానీ కొన ఊపిరితో ఉన్న సాత్విక్ ను రక్షించే ప్రయత్నం చేయకుండా విద్యార్థులపై గట్టిగా అరిచి వారిని చెదరగొట్టి గదికి తాళం వేశాడని వాపోయారు. 20నిమిషాలు పాటు ఎలాంటి ప్రధమ చికిత్స చేయకపోగా గదికి తాళం వేయడాన్ని జీర్ణించుకోలేక ఆగ్రహానికి గురైన తోటి విద్యార్థులు తాళం పగలగొట్టే ప్రయత్నం చేసి సాత్విక్ ను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయటకు తీసుకువచ్చారన్నారు. కళాశాలలో వాహనాలు సైతం లేకపోగా రహదారిపై వెళ్లే వారిని లిఫ్ట్ అడిగిన తోటి విద్యార్థులు సాత్విక్ ను రక్షించే ప్రయత్నాలు చేశారు. ఆసుపత్రికి తరలించే లోపే మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు. సాత్విక్ ఆత్మహత్య ప్రయత్నం చేసిన మరుక్షణమే చికిత్స చేసి ఉంటే బ్రతికేవాడని కళాశాల యజమాన్యం  నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు కోల్పోయాడని ఆరోపించారు. ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు ప్రిన్సిపాల్ తోపాటు వార్డెన్ పై దాడికి యత్నించారు. సాత్విక్ మృతితో కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

నార్శింగి చౌరస్తాలో బైఠాయించి ఆందోళన..

సాత్విక్ మృతిపట్ల ఆగ్రహం గురైన కుటుంబ సభ్యులు, బంధువులు నార్సింగి చౌరస్తాలో బైఠాయించి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగేదాకా ఇక్కడ నుండి కదలబోమని, ఎఫ్ఐఆర్ లో చేర్చిన నిందితులను తమ  ముందుకు తీసుకు రావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు సాత్విక్ తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఆందోళన విరమింపజేశారు. 

ప్రిన్సిపాల్, వార్డెన్ పై కేసు నమోదు..

ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతిపై  నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 305 కింద కృష్ణారెడ్డి, ఆచార్య, వార్డెన్ నరేష్ పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు సిఐ శివకుమార్ తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించామని, సాత్విక్ తల్లిదండ్రులను కళాశాల యజమాన్యంతో మాట్లాడించే ప్రయత్నాలు చేసేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు.