దేశీయ తుపాకితో పట్టుపడ్డ నిందితుడు

దేశీయ తుపాకితో పట్టుపడ్డ నిందితుడు
  • బాకీ ఉన్న వ్యక్తిని చంపేందుకు కుట్ర
  • విశ్వసనీయ సమాచారంతో పట్టుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు

ముద్ర , కుషాయిగూడ: తనకు బాకీ ఉన్న వ్యక్తిని చంపేందుకు సంచరిస్తున్న యువకుడిని మల్కాజ్గిరి ఎస్ ఓ టి పోలీసులు పట్టుకున్నారు. మల్కాజిగిరి డిసిపి డి జానకి, ఎస్ ఓ టి డిసిపి గిరిధర్ రావుల, కుషాయిగూడ ఏసిపి వెంకట్ రెడ్డి లు శుక్రవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.... మధ్యప్రదేశ్ రాష్ట్రం శివపురి డిస్ట్రిక్ట్, ఆకాజ్హిరి గ్రామానికి చెందిన యోగేంధర్ రాజ్ పుత్ (39) 2007లో హైదరాబాద్ వచ్చి కుశాల్ లాజిస్టిక్స్ లో డ్రైవర్ గా పనిచేశాడు.

2018 లో కొండాపూర్ లో యోగిరాజ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఏజెన్సీ నీ స్థాపించి పలు ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నాడు. ఈ క్రమంలో ఈసీఐఎల్ ప్రాంతంలోనీ ఈ- ప్రో సొల్యూషన్స్ డైరెక్టర్ , మౌలాలికి చెందిన షేక్ షరీఫ్ కు 25 మంది సెక్యూరిటీ గార్డులు కావాలని యోగేందర్ రాజ్ పుత్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే యోగేందర్ రాజ్పుత్ తన సెక్యూరిటీ గార్డులకు సరైన సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో... వారు యోగేందర్ రాజ్పుత్ వద్ద పని మానేసి నేరుగా షేక్ షరీఫ్ వద్ద సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నారు. అలాగే యోగేంధర్ రాజ్ పుత్ కు రావలసిన రూ. 3 లక్షల బాకీ డబ్బులను షేక్ షరీఫ్ ఇవ్వటం లేదు.

దీంతో మనసులో పెట్టుకున్న యోగేందర్ రాజ్ పుత్... షేక్ షరీఫ్ ను చంపాలని ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం... మధ్యప్రదేశ్ కి వెళ్లి లల్లు శర్మ నుంచి రూ.20 వేలకు దేశీయ తుపాకి, బుల్లెట్లను కొన్నాడు. తిరిగి హైదరాబాద్కు వచ్చిన యోగేంధర్ రాజ్ పుత్ రెండు నెలల క్రితం షేక్ షరీఫ్ ఆఫీస్ కి వెళ్లి... దేశీయ తుపాకీతో రెక్కీ నిర్వహించి తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులను ఇవ్వాలని కోరాడు. దీంతో మరుసటిరోజు తప్పకుండా డబ్బులు ఇస్తానని షేక్ షరీఫ్ చెప్పడంతో నమ్మి వెళ్లిపోయాడు. అయినప్పటికీ షేక్ షరీఫ్ మరుసటి రోజు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేశాడు.

దీంతో యోగేందర్ రాజ్పుత్ షేక్ షరీఫ్ ను ఎలాగైనా చంపాలని దేశీయ తుపాకితో సంచరిస్తున్నాడు. విశ్వాసనీయ సమాచారంతో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు, చర్లపల్లి పోలీసులు .... శుక్రవారం చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద మహీంద్రా జైలో కారులో (టీఎస్ 09 యూఏ 9277) అనుమానస్పదంగా సంచరిస్తున్న యోగేంద్ర రాజపుతును పట్టుకొని తనిఖీ చేశారు. దేశీయ తుపాకీ, 3 బుల్లెట్లు , రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని హత్యాయత్నం కుట్రను భగ్నం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈ కేసును చాకచక్యంగా చేదించిన మల్కాజ్గిరి ఎస్ఓటి ఇన్స్పెక్టర్ రాములు, చర్లపల్లి ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రెడ్డి, ఎస్ ఓ టి ఎస్ ఐ పి వాసుదేవ్, జి రఘురాముడు, బి పరమేశ్వర్, ఇతర పోలీసు సిబ్బందిని రాచకొండ సిపి డిఎస్ చౌహన్, డిసిపి జానకి, ఎస్ ఓ టి డి సి పి గిరిధర్ రావుల లు ప్రత్యేకంగా అభినందించారు.