జనగామలో ఉన్నది.. కేసీఆర్‌‌ వర్గమే..!

జనగామలో ఉన్నది.. కేసీఆర్‌‌ వర్గమే..!

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి
జనగామ శివారులో సోషల్‌ మీడియా వారియర్ల పేరుతో మీటింగ్‌

ముద్ర ప్రతినిధి, జనగామ :  ‘జనగామలో పల్లా వర్గమో.. మరో వర్గంమో లేదని.. ఉన్నది ఒకటే వర్గం.. అది కేసీఆర్ వర్గం’ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి అన్నారు. జనగామ శివారులో సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలతో నిర్వహించిన అంతర్గత సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. పల్లాతో పాటు మరో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ  కాంగ్రెస్, టీడీపీ ఏన్నో ఏళ్లు పాలించాయని, కానీ ఎన్నడైనా కేసీఆర్‌‌ అమలు చేస్తున్న విధంగా పథకాలు ఇచ్చాయా అని ప్రశ్నించారు.

కార్యకర్తలు, సోషల్‌ మీడియా వారియర్లు గ్రామ‌లు, మండలల్లో కేసీఆర్‌‌ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. జనగామ, చేర్యాల పట్టణల్లో ప్రణాళిక బద్ధంగా ముందుకు‌పోదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వారియర్లకు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉండాలని, విమర్శకు ప్రతి విమర్శతో కాకుండా, బూతుకు బూతుతో కాకుండా విషయ పరిజ్ఞానంతో సరైన విధంగా సమాధానం చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా ఏ విధంగా పనిచేయాలనే దానిపై మాత్రమే సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరితో రెగ్యులర్‌‌గా టచ్‌లో ఉంటానని, సోషల్‌ మీడియాలో‌ పని చేయాలనే ఉత్సాహం ఉన్న వారిని తీసుకుంటామని పేర్కొన్నారు.

ప్రకటన వచ్చాక వస్తా...  
జనగామ నియోజకవర్గ టికెట్‌పై ఇంకా ప్రకటన రాలేదు.. రాగానే నేను నియోజకవర్గానికి వస్తాను..’ అంటూ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి పేర్కొన్నారు. సోషల్‌ మీడియా వారియర్ల మీటింగ్‌లో పల్లా చేసి ఈ వ్యాఖ్యలు స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. జనగామ ఎమ్మెల్యే టికెట్‌ దాదాపు పల్లాకే అన్న ప్రచారం ఇప్పటికే జోరుగా సాగుతోంది. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానాల్లో వేరే వాళ్లు వెళ్లి రాజకీయాలు చేయొద్దని గతంలో మంత్రి కేటీఆర్‌‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఎమ్మెల్సీ పల్లా వ్యూహాత్మకంగా జనగామ శివారులోని రఘునాథపల్లి మండలం నిడిగొండలో మీటింగ్‌ పెట్టి జనగామ లీడర్లతో మాట్లాడారు. జనగామ టికెట్ ప్రకటన వచ్చిన తర్వాత పార్టీ నిర్ణయం ఏదైనా అంతా శిరోధార్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.