నీళ్లియ్యకపోతే మేడిగడ్డ వద్ద ధర్నా

నీళ్లియ్యకపోతే మేడిగడ్డ వద్ద ధర్నా
  • పంటలు ఎండుతుంటే చూస్తూ ఊరుకుంటమా?
  • మీ గోస చూస్తుంటే ప్రాణం తరుక్కుపోతోంది
  • అధైర్య పడొద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది
  • ముగ్దంపూర్ రైతులతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • అరిగోస పడుతున్నాం.. ఆదుకోవాలంటూ అన్నదాతల మొర

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద పదివేల మందితో ధర్నా చేసి నీటి విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. కరీంనగర్​ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి పొలం బాట పేరిట కరీంనగర్ మండలం ముగ్ధంపూర్ గ్రామంలో శుక్రవారం కేసీఆర్​ పర్యటించారు. ఈ సందర్భంగా నీళ్లు లేక ఎండిన పొలాలను పరిశీలించారు. వ్యవసాయ సాగులో రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. 

నీళ్లు లేవా? ఎన్ని తడులు కావాలి..

‘‘పంటలు ఎందుకు ఎండుతున్నాయి? పంటకు సరిపోయేంత నీళ్లు లేవా? వరి కోతకు రావాలంటే ఇంకా ఎన్ని తడులా నీళ్లు కావాలి? 24 గంటల కరెంటు వస్తుందా?”అంటూ కేసీఆర్​ నేరుగా రైతులను ప్రశ్నించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు స్పందిస్తూ ‘‘ఇంతటి కరువు ఈ పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు. నీళ్లు లేక అరిగోస పడుతున్నాం. ఇంకా రెండు మూడు తడులా నీళ్లు వస్తే గాని పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. కరెంటు ఉన్నా.. సాగునీరు లేకపోవడంతో  ప్రయోజనం లేకుండా పోయింది. ఎలాగైనా మీరే ఆదుకోవాలయ్యా”  అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

రైతులు రంది పడొద్దు.. 

రైతులు ఎవరు రంది పడొద్దు. పదివేల మందితో మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ధర్నా చేద్దాం. గేట్లు ఎత్తేదాకా అక్కడే కూర్చుందాం. పంటలు ఎండుతుంటే చూస్తూ ఊరుకుంటామా? ప్రభుత్వం నీరు ఎలా విడుదల చేయదో తేల్చుకుందాం. మీరు అధైర్య పడద్దు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందంటూ కేసీఆర్​ రైతులకు భరోసా కల్పించారు. కాగా ఉదయం 10:30 గంటలకు రావలసిన  కేసీఆర్..​ అనుకున్న షెడ్యూల్ కంటే మూడు గంటలు ఆలస్యంగా వచ్చారు. సుమారు 100 కార్ల భారీ కాన్వాయ్ తో ముగ్దంపూర్   చేరుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఒంటిగంటకు ఎర్రటి ఎండలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం కరీంనగర్ లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో భోజనం చేశారు. అనంతరం మిడ్ మానేరు  ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, సుంకే రవిశంకర్, ఒడితల సతీశ్​ బాబు, జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, సర్దార్ రవీందర్ సింగ్, నారదాసు లక్ష్మణరావు, తో పాటు రాష్ట్ర నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

  • ఫోన్​ ట్యాపింగ్‌పై క్లారిటీ ఇస్తా!
  • రెండుమూడు రోజుల్లో ఈ విషయంపై స్పందిస్తా
  • త్వరలో నిజాలు బయటకు తీసుకొస్తాయి : కేసీఆర్​
  • చవటలు, దద్దమ్మలంటూ కాంగ్రెస్ నేతలపై ఫైర్​

‘‘నేను పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తాను. అందులోని నిజానిజాలు బయటకు తీసుకువస్తా’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో స్పందిస్తానన్నారు. విద్యుత్ కొరతపై అధికార కాంగ్రెస్  పార్టీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘పవర్  షార్టేజ్  ఎందుకు అవుతోంది? అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతగాని చవటలా?’’ అని మండిపడ్డారు. అంతకుముందు ఇదే పరిస్థితి ఉంటే ఏడాదిలో తాము అంతా క్లియర్ చేశామన్నారు. కాంగ్రెస్  పార్టీలా పీఆర్ స్టంట్లు చేయలేదన్నారు. అలాంటప్పుడు మేం అసమర్థులం, ప్రభుత్వం నడపడం చేతకాదని అంగీకరించాలన్నారు.