జన జాతరకు  సర్వం సిద్ధం

జన జాతరకు  సర్వం సిద్ధం
  • నేడు తుక్కుగూడలో కాంగ్రెస్  భారీ బహిరంగ సభ
  • హాజరుకానున్న ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక
  • జన సమీకరణకు కాంగ్రెస్​ ముమ్మర ఏర్పాట్లు
  • బీఆర్ఎస్​ నుంచి పలువురు ఎమ్మెల్యేలు చేరే ఛాన్స్


పార్లమెంట్​ ఎన్నికల ప్రచారాన్ని ఏఐసీసీ గ్రాండ్​గా ప్రారంభించనుంది. నేడు తుక్కుగూడలో నిర్వహించే జన జాతర సభతో ఇందుకు శ్రీకారం చుడుతోంది. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్​గాంధీ, ఖర్గే, ప్రియాంక తదితరులు హాజరుకానున్న ఈ సభ విజయవంతం కోసం టీ కాంగ్రెస్​ నేతలు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్​ 7న సోనియా గాంధీ తుక్కుగూడలోనే 6 గ్యారంటీలను ప్రకటించారు. ఈనేపథ్యంలో త‌మ‌కు అచ్చొచ్చిన ఈ ప్రాంతం నుంచే లోక్‌స‌భ ఎన్నిక‌లకు స‌మ‌రశంఖం పూరించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. 

ముద్ర, తెలంగాణ బ్యూరో : లోక్ సభ ఎన్నికల్లో జంగ్ సైరన్  మోగించేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. తమకు బాగా కలిసొచ్చిన తుక్కుగూడ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఇందులో భాగంగా శనివారం జన జాతర పేరిట భారీ బహిరంగ సభను తలపెట్టింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు హాజరవుతున్నారు. ఈ  బహిరంగ వేదిక నుంచే కాంగ్రెస్  పార్టీ లోక్ సభ ఎన్నికల మేనిఫోస్టోను విడుదల చేయనుంది. 

5 గ్యారంటీలు ప్రకటించే ఛాన్స్..

ఈ ఎన్నికలు దేశ ముఖ‌ చిత్రాన్ని మార్చనుండడంతో కాంగ్రెస్  పార్టీ శ్రేణులు  జనజాతర సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీగా జన సమీకరణ చేయడం ద్వారా రాష్ట్రంలో బీజేపీతో పాటు బీఆర్ఎస్ పార్టీలకు స్థానం లేదన్న నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లనున్నారు. ఈ సభ ద్వారా న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ప‌దేళ్ల ఎన్డీఏ నిరంకుశ‌, దుష్పరిపాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడాల‌నే కృత‌నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలోనే తుక్కుగూడ‌లోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించే భారీ బ‌హిరంగ స‌భ‌లో నేషనల్ మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌నున్న 5 గ్యారంటీల‌ను కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం ప్రక‌టించ‌నుందని తెలుస్తోంది. 

భారీగా జన సమీకరణ..

సభకు భారీగా ప్రజలను తరలించి జన జాతర సక్సెస్​ చేయాలని కాంగ్రెస్​ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు గత నాలుగైదు రోజులుగా సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సభకు తరలి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 300 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జనజాతర సభకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 10 లక్షల మందికిపైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఈ సభలో ప్రధాన వేదికకు ఇరు వైపులా భారీ వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. రాజీవ్ ప్రాంగణంగా నామకరణం చేసిన వేదికపై ఏఐసీసీ ముఖ్య నేతలు సహా ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు తదితరులు 250 మంది వరకు ఆసీనులయ్యేలా భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన వేదిక సహా లైటింగ్, సౌండ్ సిస్టం ఏర్పాటు, కుర్చీలు, గ్యాలరీల ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి.

గతేడాది ఇక్కడి నుంచే విజయభేరి ర్యాలీ..

గత ఏడాది సెప్టెంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలను సోనియాగాంధీ ప్రకటించి విజయభేరి ర్యాలీ ప్రారంభించారు. ఆమె ప్రక‌టించిన ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రజ‌ల విశ్వాసాన్ని  విశేషంగా చూర‌గొన‌డంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించింది. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు క‌లిసివ‌చ్చిన తుక్కుగూడ నుంచే లోక్‌స‌భ ఎన్నిక‌లకు స‌మ‌రశంఖం పూరించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆరు గ్యారంటీల హామీ ప్రజ‌ల్లోకి దూసుకెళ్లిన‌ట్లుగానే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ఇచ్చే అయిదు గ్యారంటీలు దేశంలోని అన్ని మూల‌ల‌కు, అన్ని వ‌ర్గాల్లోకి వెళతాయ‌ని కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం బ‌లంగా న‌మ్ముతోంది. దీంతో తుక్కుగూడలో జరగనున్న సభపై అందరి చూపు మళ్లడంతో ప్రజల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ గణనీయమైన అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ మోడల్‌ను దేశానికి అందించాలన్న లక్ష్యంతోనే జనజాతర సభను నిర్వహిస్తున్నామని ఇప్పటికే కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆ సభ నుంచే హస్తం పార్టీ అధినాయకత్వం దేశానికి గ్యారంటీ ఇచ్చేలా మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు క్లారిటీనిచ్చింది. అలాగే  జాతీయ మేనిఫెస్టోలో పాంచ్‌ న్యాయ్‌లు, 25 గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.కాగా తుక్కుగూడ వేదికగా నిర్వహించే జనజాతర సభలో బీఆర్ఎస్ నుంచి పెద్దఎత్తున నేతలు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా   కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  ఇప్పటికే కడియం, దానం వీరిలో జిల్లాకు చెందిన పలువురు ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కూడా ఉండనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.


ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేతలు

ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, వరంగల్ నుంచి మహబూబ్ నగర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి భారీగా జనాన్ని సమీకరించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు తుక్కుగూడలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేదిక నుంచి కాంగ్రెస్ కు రాష్ట్రంలో ప్రజాదరణను దేశానికి చాటి చెప్పనుంది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలంతా ఈ సభకు హాజరు కానుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల క్రితం తుక్కుగూడలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే  జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభా స్థలిని సందర్శించి, ఏర్పాట్లపై ఆరా తీశారు.