సొంతింటి 'కల' నెరవేరేదెన్నడూ..! 

సొంతింటి 'కల' నెరవేరేదెన్నడూ..! 

సొంతింటి 'కల' నెరవేరేదెన్నడూ..! 
- డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై వీడని నిర్లక్ష్యం..
- పనుల్లో కనిపించని కదలిక..
- తుప్పు పట్టిపోతున్న స్టీల్..
- పిల్లర్ల మధ్యలో పెరుగుతున్న చెట్లు, పుట్టలు..
 పేదలకు సొంతింటి 'కల' నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకున్నాయి. పనుల్లో కదలిక కనిపించడం లేదు. అనేక జిల్లాల్లో పిల్లర్ల స్థాయిలోనే పనులు ఆగిపోయి ఏళ్లు గడుస్తుండడంతో స్టీల్ తుప్పు పట్టి, ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయి. మరి కొన్ని చోట్ల చెట్లు, పుట్టలు పెరిగి కంచెలను తలపిస్తున్నాయి. ఇండ్ల నిర్మాణాలకు నిధులు అందకపోవడంతో పనులు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. ఆయా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో పేదలకు ఒకే చోట డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే సర్కారు సంకల్పం మధ్యలోనే నీరు కారిపోతుంది. ప్రభుత్వ స్థలాలు లేని చోట భూమి కొనుగోలు చేసి ఇండ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో సాధ్యం కాకపోవడంతో కొన్ని గ్రామాలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసింది. మరికొన్ని గ్రామాల్లో స్థలాల కొరత పేరుతో ఆయా గ్రామాల్లో ఇండ్ల ఊసే లేదు. 

 తెలంగాణ సర్కారు రూ.18.328 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 2.91 లక్షల డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి పేదలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో అనువైన స్థలాలను గుర్తించి డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇండ్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ శాఖ అధికారులకు బాధ్యతలు ఇవ్వగా కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకొని  నిర్మాణాలను చేపట్టారు. ఈ మేరకు ఇప్పటివరకు ప్రభుత్వం సుమారు రూ.11,990 కోట్లు బిల్లులు విడుదల చేయగా, సుమారు 26వేల ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. అందులో చేసిన పనులకు కొన్ని వేల కోట్లు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉన్నది. బిల్లులు చెల్లించడంలో ఆలస్యం అవుతుండడంతో పనులు నిలిచిపోతున్నాయి. నిధుల లేమి కారణంగా కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడంతో ఇండ్ల నిర్మాణ పనులకు బ్రేక్ పడ్డట్టయింది. 

-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2952 ఇండ్లు పెండింగ్..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు 2952 డబుల్ బెడ్ రూం ఇండ్లు పెండింగ్ లో ఉన్నాయి. జిల్లాకు రూ.136 కోట్ల 70 లక్షల అంచనా వ్యయంతో 3882 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 930 ఇండ్లు మాత్రమే పూర్తయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరై సుమారు నాలుగైదు ఏళ్ళు కావస్తున్నా అర్ధాంతరంగా పనులు ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మాత్రం పట్టించుకోవడం లేదు. నాలుగైదు ఏళ్లుగా పిల్లర్ల స్థాయిలోనే ఇండ్ల నిర్మాణాలు ఉండడంతో వర్షాలకు తడిసిపోయి స్టీల్ తుప్పు పట్టి పోతుంది. కొన్నిచోట్ల పిల్లర్ కోసం అమర్చిన స్టీల్ అంతా నేల వాలింది. మరికొన్ని గ్రామాల్లో పిల్లర్ల మధ్య చెట్లు, పుట్టలు పెరిగిపోయి అటుగా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
ఇండ్ల నిర్మాణాలు జరిగిన చాలా చోట్ల ఇండ్ల కిటికీలు , తలుపులు మాయం అవుతున్నాయి. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు , 2018 లోనే పూర్తయినా ఇప్పటివరకు పంపిణీ చేయక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- పనుల్లో కదలిక వచ్చేనా..
ఆయా మండలాల్లో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ నిర్మాణ పనుల్లో కదలిక వచ్చేనా.. అని ఆయా గ్రామాల్లో లబ్దిదారుల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లర్ల స్థాయిలో ఉన్న స్టీల్ తుప్పు పట్టి పోతుందని, ఆ స్టీల్ తోనే పిల్లర్లు ఎలా నిర్మిస్తారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇండ్ల నిర్మాణాలపై పలుమార్లు అధికారులను ప్రశ్నించినప్పటికీ అధికారుల్లో ఎలాంటి సమాధానం ఉండడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల స్థాయి అధికారులు ఇటీవలే లబ్ధిదారులను కలిసి ఎవరి ఇంటిని వారే నిర్మించుకుంటే వారికి బిల్లులు ఇప్పిస్తామని అంతర్గతంగా చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి సమాధానంగా తమ వద్ద డబ్బులు లేవని తాము ఇండ్ల నిర్మాణాలను చేపట్టలేమని లబ్ధిదారులు చెప్పినట్లు గ్రామాల్లో చర్చించుకుంటున్నారు.

..పాతవి కడ్తలేరు.. కొత్తవి ఇస్తలేరు..

పనులు పెండింగ్ లో ఉన్న పాత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కడ్తలేరు.. ఎవరి ఇంటి స్థలాల్లో వారే ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు ఇస్తామన్న కొత్తవి మంజూరు ఇవ్వడం లేదని ఆయా గ్రామాల్లోని ఇల్లు లేని నిరుపేదలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో సర్కారు ఏ పథకం ప్రవేశపెట్టిన పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం పట్ల విమర్శలు వెలువడుతున్నాయి. ఆయా గ్రామాల్లో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇండ్లు మంజూరు చేయాలని, అధికారులు పారదర్శకంగా వ్యవహరించి పార్టీలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.