ఎర్రబెల్లి సర్వే వెనుక ఉంది ఎవరు...

ఎర్రబెల్లి సర్వే వెనుక ఉంది ఎవరు...
minister errabelli dayakar rao


రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాట్‌ కామెంట్స్‌ ఇప్పుడు వరంగల్‌ అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆలోచనలో పడేశాయి. హాట్‌ టాపిక్‌ గా మారిన మంత్రి మాటల వెనుక అసలు మర్మం ఏమిటీ? బీఆర్‌ఎస్‌ పై ఉన్న వ్యతిరేకతను మంత్రి ఎర్రబెల్లి చెప్పకనే చెప్పారా? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.సీఎం కేసీఆర్‌ చేయించిన సర్వేలతోపాటు, పీకే సర్వేలో పార్టీ ఛరిష్మా తగ్గిందని తేలడం వల్లే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో ఈ వ్యాఖ్యలు చేయించారని అంటున్నారు. వివిధ రకాల చర్చలతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని సృష్టిస్తుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వ్యాఖ్యలకు అంతరార్థం ఏంటి? అధికార పార్టీ ఎమ్మెల్యేలలో టెన్షన్‌తో పాటు ఆశావహులలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.రాజకీయాల్లో అపజయం ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెలుగొందుతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం ఆయన సొంతం. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎర్రబెల్లి, తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన వెంటే ప్రజలున్నారని నిరూపించారు. జన హృదయనేతగా గుర్తింపు పొందిన ఎర్రబెల్లిని టీఆర్‌ఎస్‌ లోకి సీఎం కేసీఆర్‌ ఆహ్వానించి మంత్రి పదవి కట్టబెట్టారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా మారారు.

ఓరుగల్లు పాలిటిక్స్‌ ఆయన తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంది. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేతగా ఎర్రబెల్లికి గుర్తింపు ఉంది. పోలిటికల్‌ గా ఎంతో అనుభవం ఉన్న ఆయనకు సీఎం కేసీఆర్‌ కూడా విలువ ఇస్తారని పార్టీలో చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది సిట్టింగ్‌ లను మార్చితే 100 సీట్లు గ్యారంటీ అంటూ ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఇప్పటి వరకు తన సర్వేలు తప్పు కాలేదంటూ ఆయన ప్రకటించడంపై పెద్ద దుమారమే లేచింది. సీఎం కేసీఆరే ఎర్రబెల్లితో సర్వే చేయించారా.. లేక ఆయనే సొంతంగా సర్వే చేయించారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఎవరా 20 మంది ఎమ్మెల్యేలు అన్న చర్చ రచ్చ రచ్చ అవుతోంది. అయితే అధిష్ఠానం సూచన మేరకే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అలా మాట్లాడి ఉంటాడన్న వాదన కూడా ఉంది.ఓ వైపు సీఎం కేసీఆర్‌ పలుమార్లు సిట్టింగులకే సీట్లు ఇస్తామంటూ ప్రకటించారు. ప్రజల్లో వారికున్న వ్యతిరేకతను గుర్తించిన సీఎం కేసీఆర్‌ సైతం ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పని తీరును మార్చుకోవాలంటూ దిశా నిర్దేశం  చేశారు. ఆయన సూచనలతో పార్టీ కార్యాలయాలను వీడిన ఎమ్మెల్యేలు గ్రౌండ్‌ లెవల్‌ లో తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకుపోతూ పార్టీ ప్రతిష్ఠతకు పాటుపడుతున్నారు. ఈ తరుణంలో మంత్రి ఎర్రబెల్లి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఎర్రబెల్లి వ్యాఖ్యలపై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ఎర్రబెల్లిక్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారు మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదని ఆయన అంచనా వేశారన్న ప్రచారం సాగుతోంది. అందుకే అలాంటి వారిని మార్చేయాలని సీఎం కేసీఆర్‌ కు ఎర్రబెల్లి సూచన చేసినట్లు సమాచారం. అయితే ఆయా స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థుల పేర్లను కూడా ఆయన సూచించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకూ ఎర్రబెల్లి అసంతృప్తిగా ఉన్న సదరు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఓరుగల్లు పాలిటిక్స్‌ లో జోరుగా చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు రిజర్వ్‌ ఎమ్మేల్యే లతో పాటు ఒకరు బీసీ, మరోకరు  ఓసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిని  మార్చకపోతే బీఆర్‌ఎస్‌ కు నష్టం వాటిల్లుతుందని ఎర్రబెల్లి ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్లు సమాచారం. అయితే ఎర్రబెల్లి చెప్పినట్లు అయా స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేక అందులో కొందరిని మార్చుతారా అనే ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలపై రాజకీయాలు విశ్లేషకులు మాత్రం నిప్పు లేనిదే పొగ రాదు అన్న సామెతను గుర్తు చేస్తుండగా సొంత పార్టీ నాయకుల మాత్రం అంతా ఉట్టిదేనంటూ కొట్టిపడేస్తున్నారుమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చేసిన వ్యాఖ్యలు ఆశావహుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. సిట్టింగులను పక్కనపెడితే తమకే టికెట్‌ వస్తుందన్న ఆనందంలో ఉన్నారు కొందరు ఆశావాహులు.  ఆశావహులను అలర్ట్‌ చేసేందుకు ఎర్రబెల్లి అలా వ్యాఖ్యానించి ఉంటాడని భావిస్తున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్నందుకు రానున్న రోజుల్లో మంచే జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారట మరికొందరు నాయకులు. అయితే వారి అశలు నెరవేరుతాయా లేదా అన్నది సీఎం కేసీఆర్‌ పై ఆధారపడి ఉంది.

ఎర్రబెల్లి దయాకర్‌ రావు కేవలం 20 మందిని ఉద్దేశించి మాట్లాడలేదని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కు ఎదురీత తప్పదని అంటున్నారు. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ పై ప్రజలకు నమ్మకం పోయిందంటూ ప్రచారం చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రతో కాంగ్రెస్‌ పార్టీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని, గ్రామాలలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు అలానే ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ కమలనాథులు ప్రచారం సాగిస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో టెన్షన్‌.. ఆశావహులలో టికెట్‌ వస్తుందనే ఆశా రెట్టింపు అయిందనే టాక్‌ నడుస్తోంది. మంత్రి ఎర్రబెల్లి మాటలు ఎటువైపు దారి తీస్తాయోనని జనంతో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.