నేడు రాష్ట్ర కేబినెట్​భేటీ

నేడు రాష్ట్ర కేబినెట్​భేటీ
  • 40 నుంచి 50 అంశాలపై చర్చ?
  • అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లుల ముసాయిదాకు ఆమోదం!
  • ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు, వరద నష్టంపై విధివిధానాలు ఖరారు

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు ప్రారంభం కానుంది. తెలంగాణ సచివాలయంలో సీఎం కేసీఆర్​అధ్యక్షతన ప్రారంభమయ్యే ఈ మీటింగ్​లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలకు, రోడ్లకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్ ఎజెండాలో 40 నుంచి 50కిపైగా అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. వరదలు, పర్యవసానంగా జరిగిన పరిణామాలతోపాటు ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. పంటల సాగు ఊపందుకుంటున్న సమయంలో వరదలు రావడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి.. ప్రత్యామ్నాయ పంటల గురించి చర్చించనుంది. కాల్వలు పొంగిపొర్లడంతో రోడ్డు నెట్‌వర్క్‌కు నష్టం వాటిల్లడంతోపాటు అవసరమైన మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు సంబంధించిన విధివిధానాలను మంత్రివర్గం ఖరారు చేసే అవకాశం ఉంది. టీఎస్‌ఆర్‌టీసీకి సంబంధించిన పలు సమస్యలపై తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వేతన సవరణ అమలుతోపాటు ఇతర అంశాలపై చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

  • టేకేదార్లకు ఆసరా పింఛన్లపై.. 

అలాగే బీడీ పరిశ్రమ టేకేదార్లకు ఆసరా పింఛన్లు ఇచ్చే విషయంపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పురపాలక శాఖకు చెందిన పలు అంశాలు కూడా చర్చకు రానున్నట్లు తెలిసింది. వివిధ శాఖల్లో పోస్టుల మంజూరు సహా ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటుపైన ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి కూడా మంత్రివర్గం ఆమోదం లభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ, గృహలక్ష్మి, బీసీ, మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం, దళితబంధు సహా కీలకమైన పథకాల అమలు, పురోగతి, తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా చర్చ జరగనుంది. అలాగే ఆర్థిక పర అంశాలు కూడా మంత్రివర్గంలో చర్చకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వపరంగా పూర్తి చేయాల్సిన పనులపైనా మంత్రివర్గంలో చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇక ఆగస్టు 3వ తేదీ గురువారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. సమావేశాల ద్వారా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు, విపక్షాలు ఎదుర్కోవడం, ఇతర అంశాలు చర్చకు రానున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చే బిల్లుల ముసాయిదాపై కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలుపుతారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.