కేసీఆర్ ను చర్లపల్లి జైలుకు పంపిస్తాం

కేసీఆర్ ను చర్లపల్లి జైలుకు పంపిస్తాం
  • రైతులను ఆదుకోవడంలో విఫలం
  • టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

బిచ్కుంద, ముద్రః గత పదేళ్ళలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం తెలంగాణను దోచుకొందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని చర్లపల్లి జైలుకు పంపిస్తామని, అక్కడే డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తామని టిపిసిసి చీఫ్ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందలో జరిగిన విజయభేరి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆనాడు తెలంగాణ విద్యార్థులు, ఉద్యమకారులు, అమరవీరులు తెలంగాణ సాధిస్తే కేసీఆర్ కుటుంబం అధికారంలోకి వచ్చి దోచుకొంటోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్కు 10 సంవత్సరాల సమయం ఇచ్చారని, తెలంగాణ అభివృద్ధిని పక్కన . పట్టి, ఆయన కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని నూటికి నూరుశాతం దోచుకున్నారని ఆరోపించారు. జుక్కల్ ప్రాంత చెరుకు రైతులను ఆదుకోలేదని, పేదలను ఆదుకోలేదని, నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీకు డబుల్ బెడ్రూం వచ్చిందా, మూడెకరాల భూమి ఇచ్చాడా, లెండిని పూర్తి చేశారా, కెజిటు పిజి ఉచిత విద్య ఇచ్చారా, మైనారిటీలకు 12శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారా, పేదలకు డబుల్ బెడ్రూం ఎందుకు ఇవ్వలేదు అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించే బాధ్యత నేను, జుక్కల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొంటారని అన్నారు. కెసిఆర్తో పాటు ఆయన కొడుకు, బిడ్డ ఉండడానికి కచ్చితంగా ఇల్లు కటిస్తానని అన్నారు. నీ కుటుంబం తెలంగాణను దోచుకొందని, జైలుకు పంపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పునరుద్ఘాటించారు.

రైతులకు రైతుబంధు ఇస్తే ఇబ్బంది లేదని అన్నారు. దళితులకు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని, ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని, అంబేడ్కర్ సాక్షిగా దళితుల ప్రతాపం చూపాలని అన్నారు. కేసీఆర్ను గద్దె దించే వరకు దళితులు ఊరుకునేది లేదని అన్నారు. జుక్కల్లో హన్మంత్ షిండే 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడని, పార్టీ మారి టిఆర్ఎస్లోకి పోయాడని, కానీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మంజీరా వాగు నుంచి ఇసుక దోపిడి చేస్తూ, ఇక్కడ సంపాదించి మహారాష్ట్రలో ఆస్తులు, అభివృద్ధి చేసుకొన్నాడని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్ద కల అయిన లెండి ప్రాజేక్టును పూర్తి చేస్తా అని చెప్పి పదేళ్ళు అయినా ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారు. ప్రజల కష్టాలు తెలియని ఎమ్మెల్యేను ఓడించి, కాంగ్రెస్ అభ్యర్ధి లక్ష్మికాంర్రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మికాంత్అవుతో పాటు కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.