ఆ రెండు పాటలు విడుదల చేయకముందే... అనుమానాస్పద మృతి

ఆ రెండు పాటలు విడుదల చేయకముందే... అనుమానాస్పద మృతి
  • దక్షిణ కొరియా పాప్ సింగర్ పార్క్ బో రామ్ కన్నుమూత

 సియోల్: దక్షిణ  కొరియా దేశానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ పార్క్ బో రామ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఒక రెస్ట్ రూంలో సింక్ వద్ద ముఖం కడుక్కుంటూ అలాగే తూలి పడిపోయినట్టుగా ప్రాణాలు వదిలారు. అందమైన రూపం, అంతే అందమైన కంఠస్వరంతో పదేళ్లుగా ఆమె దక్షిణ కొరియా వాసులను తన గానామృతంతో ఉర్రూతలూగిస్తున్నారు. మూడు పదుల వయసులోనే ఆమె మరణించారన్న వార్తను దక్షిణ కొరియాలోని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె పాప్ సింగర్ గా పదేళ్లు పూర్తికావస్తున్న సందర్భంలో గౌరవసూచకంగా ఈ ఏడాది చివరిలో రెండు కొత్త పాటలను విడుదల చేస్తానని, కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. ఆ రెండు పాటలు విడుదల చేయకముందే ఆమె శాశ్వతంగా వెళ్లిపోయారు. నమ్యంగ్జు పోలీస్ స్టేషన్ అధికారులు చెబుతున్నదాని ప్రకారం ఆమె చనిపోయేందుకు కొద్ది గంటల ముందు ఒక ప్రైవేటు ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడ ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం తాగారు. ఆ తర్వాత రాత్రి 9.55 గంటలకు ఆమె రెస్ట్ రూమ్ కు వెళ్లారు. అక్కడ సింక్ పై వంగి అపస్మారక స్థితిలో చనిపోయి వుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.