చంచల్‌గూడ జైలుకు క్రిశాంక్...

చంచల్‌గూడ జైలుకు క్రిశాంక్...

ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) ఫేక్ సర్క్యులర్ సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలతో బుధవారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ 466, 468, 469, 505(1)(C) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిశాంక్‌ను పంతంగి టోల్‌ప్లాజా వ‌ద్ద నిన్న అదుపులోకి తీసుకున్నారు.

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా.. క్రిశాంక్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రిశాంక్‌పై గతంలో 14 కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో నాగేందర్ అనే నిజాం కాలేజ్ బీఆర్ఎస్ స్టూడెంట్ లీడర్‌పైనా కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, క్రిశాంక్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఖండించారు. మన్నె క్రిశాంక్‌ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రకటించారు.