6 గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాల ప్రారంభం

6 గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాల ప్రారంభం
  • ప్రజా ప్రభుత్వంలో ప్రజాసేవ నినాదంతో కాంగ్రెస్
  • సంక్షేమ పథకాలను ప్రారంభించిన అధికారులు ప్రజాప్రతినిధులు

హుజూర్ నగర్ ముద్ర:తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మేనిఫెస్టోతో అధికారాన్ని స్థాపించింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 6 గ్యారంటీలలో భాగమైన ఆర్టీసీ బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం పథకమైన మహాలక్ష్మి ప్రతి కుటుంబానికి 10 లక్షల వైద్య సాయం హామీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాల అమలుపై తొలి సంతకం చేయడం జరిగింది.

నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఉచిత టికెట్లను అధికారులు ప్రజాప్రతినిధులు అందజేశారు. అనంతరం ఏరియా హాస్పిటల్ లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించి పథకానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి , ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్ కరుణ్ కుమార్,మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చన రవి , ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, మఠంపల్లి ఎంపీపీ మూడావత్ పార్వతి కొండా నాయక్, తన్నీరు మల్లికార్జున్, సాముల శివారెడ్డి , దొంతగాని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.