భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ను రాష్ట్ర కమిటీ బుధవారం ప్రకటించింది. జహంగీర్  స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామం .  వ్యవసాయ కూలీలు కుటుంబం మహబూబ్అలీ, బీజన్ బీ లకు 1970 లో  జహంగీర్ జన్మించారు . పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన జహంగీర్  విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ లో చేరి,  డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాలతో పాటు పార్టీ పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తున్నారు . వామపక్ష బావజాలంతో ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు.  తండ్రి మహబూబ్ అలీ వామపక్ష ఉద్యమంలో భాగంగా కరువు దాడులు చేసిన వ్యక్తి.  జొన్నల లారీని అడ్డగించి ప్రజలకు వాటిని పంచిన వ్యక్తిగా,  పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొన్న తన తండ్రి జహంగీర్ మనసులో తనదైన ముద్ర వేశారు. దీంతో అతను వామపక్ష భావజాలం వైపు మరలడానికి అదొక కారణంగా పేర్కొనవచ్చును. తన స్వగ్రామమైన మునిపంపుల గ్రామానికి సర్పంచ్ గా పనిచేసే ప్రజల మన్ననలు పొందారు. 
ఉద్యమాలే ఊపిరి. 
సిపిఎం భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ కు ఉద్యమాలే ఊపిరిగా ఉంటాయి ప్రజా సమస్యలను గుర్తించడం వాటి పరిష్కారం కోసం  ప్రజలను చైతన్యవంతం చేయడం,  ప్రభుత్వం ,అధికారులపై,  ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడానికి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఆయన దినచర్య.  ప్రస్తుతం సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ ప్రాంతానికి సుపరిచితులు.  జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా వ్యాప్తంగా  సిపిఎం బృందంలో తను పాల్గొని పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం చేసిన దశలవారీగా ఆందోళన కార్యక్రమంలో అగ్ర భాగాన నిలిచి ముందుకు సాగారు.  గంధ మల్ల రిజర్వాయర్ ను నిర్మించాలని,  ఈ ప్రాంత రైతులకు సాగునీరు ప్రజలకు తాగునీరు అందించాలని ,మూసి కాలువల ప్రక్షాళన, బునాది గాని, ఫిలాయి పల్లి కాలువ ,ధర్మారెడ్డి కాల్వల కోసం,  ఎయిమ్స్ లో వైద్య సౌకర్యాలు అందించాలని , బస్వాపురం ప్రాజెక్టు పూర్తి చేయాలని, భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని అనేక పోరాటాలు నిర్వహించారు. పరిశ్రమల కాలుష్యంపై స్థానిక యువతకు స్థానికంగా ఉద్యోగం కల్పించాలని, భువనగిరి రైల్వే స్టేషన్ లో రైళ్ల నిలిపివేత కోసం,  రవాణా సదుపాయాలు మెరుగుపరిచే విధంగా బస్సులు ఏర్పాటు చేయాలని,  రోడ్లు మౌలిక సదుపాయాలు, భువనగిరి కోట అభివృద్ధి రోడ్డు వెడల్పు నిర్వహించిన పోరాటాల్లో పాల్గొన్నారు. కార్మిక, కర్షక , సంఘటిత అసంఘటిత కార్మికుల హక్కుల కోసం పనిచేశారు .  ప్రజానాట్యమండలి  కళాకారుడిగా పనిచేయడంతో ఈ ప్రాంత  చరిత్ర, ప్రజా సంస్కృతి కళారూపాలపై,  ప్రజల ఆర్థిక రాజకీయ సామాజిక స్థితిగతులపై అవగాహన కలిగి ఉన్న వ్యక్తి. దేవాదాయ భూముల పరిరక్షణ కోసం, అటు వక్ఫ భూముల పరిరక్షణ కోసం, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం సిపిఎం నిర్వహించిన ఉద్యమాలలో పాల్గొన్నారు.