సైదాపురం నుండి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన  డీసీసీబీ చైర్మన్ గొంగిడి..

సైదాపురం నుండి బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన  డీసీసీబీ చైర్మన్ గొంగిడి..

యాదగిరిగుట్ట (ముద్ర న్యూస్): నవంబర్ 30న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికలలో ఆలేరు శాసనసభకు బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొంగిడి సునీత మహేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆమె భర్త ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి శుక్రవారం నాడు యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్యాలయానికి నూతన భవనంతో పాటు అన్ని కుల సంఘాలకు భవనాలు కట్టించామని చెప్పారు. కులాల పేరుతో కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో తెలంగాణ ప్రజలకు గౌరవం పెరిగిందని అన్నారు.

భువనగిరి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి సైదాపురానికి ఒక్క రూపాయి అయిన అభివృద్ధి పనులు చేశారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మురికి కాల్వలో వేసినట్లేనని చెప్పారు. మహిళల కోసం కేసీఆర్ తిప్పలు వర్ణనాతీతం అని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. కాంగ్రెస్ నాయకులవి జూటా మాటలు అని ప్రజలను హెచ్చరించారు. అరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్ మళ్లీ ఒక్క ఛాన్సంటూ ముందుకొస్తున్నారు అని ఆరోపించారు. అరవై ఏండ్ల పాలనలో చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారు అని నిలదీశారు. అరవై ఏండ్లలో కాంగ్రెస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు.

నమ్మకానికి కేసీఆర్ పెట్టింది పేరు అని అలాంటి కేసీఆర్ హామీ ఇచ్చాడంటే ఎంతటి వధిదుడుకులు ఎదురైనా నెరవేరుస్తారు అని కితాబిచ్చారు. 40 వేల మెజారిటీతో ఆలేరు నియోజకవర్గంలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మరోమారు గెలవబోతున్నాం అని జోష్యం చెప్పారు. తెలంగాణ బిడ్డలు ప్రాణాలను బలి తీసుకుంటే గానీ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. ఎవరికి ఏం అవసరం, ఏ కులానికి ఏం కావాలో కేసీఆర్ కు తెలుసు కాబట్టే అందుకనుగుణంగా పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు గౌరవం పెరిగిందంటే కేసీఆర్ పుణ్యమేనని చెప్పారు.

ఆలేరులో 2 లక్షల ఎకరాలకు పంటసాగు విస్తరించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చేసిన కృషి ఎనలేనిది అని వివరించారు. విదేశీ చదువుల కోసం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ కింద కేసీఆర్ రూ.20 లక్షలు ఇవ్వడం కేసీఆర్ ప్రభుత్వానికి విద్యపై ఉన్న శ్రద్ధకు నిదర్శనమని అన్నారు. కేసీఆర్ గారు సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టం అని తెలిపారు. కేసీఆర్ గనుక సీఎం కాకుండా రాష్ట్రం ఆగమయ్యేదని అన్నారు. కేసీఆర్ చెప్పాడంటే చేసి తీరుతాడని చెప్పారు. కరుణ విపత్కర పరిస్థితులలో ప్రభుత్వ విధించిన లాక్ డౌన్ లో ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి ప్రజలను ఆదుకుంది కేసీఆర్ కాదా అని ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలను ప్రశ్నించారు. సైదాపురం నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం నాకు కలిసొస్తుందని చూసి చెప్పారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన వెంటనే రూ.400 కే వంట గ్యాస్‌, ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. సైదాపురం ఆడబిడ్డగా భావించి మరోసారి నన్ను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. 29న ఆలేరులో  బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కర్రె వెంకటయ్య తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు......