బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం.

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం.
  •  గారడీ చేసే మాటలు నమ్మి మోసపోవద్దు. 
  •  ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని, గారడీ చేసే మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని ఎంపేడు, వెల్లంపల్లి, దుబ్యాల, మందలోరిపల్లి తదితర గ్రామాలలో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగిందని, గతంలో కంటే ఊహించని స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మరోసారి అధికారం ఇవ్వాలని కోరారు.

గారడీలు చేసే వారి మాటలు నమ్మవద్దని, ప్రజలు ఆలోచించుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. అభివృద్ధి చేసే పార్టీ ఏది, అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు ఎవరు అనేది గుర్తు చేసుకోవాలని తెలియజేశారు. వ్యవసాయాన్ని పండుగ చేసి, కేసీఆర్ అన్నపూర్ణ రాష్ట్రంగా ఏర్పాటు చేశారని, త్రాగు, సాగు నీరు కోసం ప్రాజెక్ట్ లను నిర్మించడం జరిగిందని, పట్టణాలను పారిశ్రామిక రంగాలుగా తీర్చిదిద్దే క్రమంలో టీ హబ్ లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో దళిత బంధు, గృహలక్ష్మీ అర్హులను ఎంపిక చేసి సిద్ధంగా ఉన్నప్పటికి, ఎన్నికల కోడ్ ఉన్నందున ఆగిపోయాయని, ఎన్నికల అనంతరం ప్రతి సంక్షేమ పథకం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, సర్పంచ్ లు ఉమేందర్ రావు, రాజయ్య, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.