ఆడబిడ్డగా ఆదరించండి

ఆడబిడ్డగా ఆదరించండి
  • అవకాశవాదులకు అవకాశం ఇవ్వొద్దు
  • మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:ఎన్నికల్లో అవకాశవాదులకు అవకాశం ఇవ్వకుండా, ఆడబిడ్డగా ఆదరించి మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో హవేళీ ఘనపూర్ మండల పరిధిలోని ముత్తాయిపల్లి, ఫరీద్ పూర్, చిన్నశంకరంపేట మండల పరిధిలోని అంబాజీపేట గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు 300 మంది మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వారికీ ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినవారు తన పదవికాలంలో కూడా నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు. 13 ఏళ్ల పాటు  నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండా ఎన్నికల రాగానే కొడుకును తీసుకవస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ స్థితిగతులు తెలవని వారికి ఓటు వేస్తే నష్టపోతామన్నారు.

అభివృద్ధిపాటు ప్రజాసంక్షేమానికి సమ ప్రధాన్యతనిస్తున్న  ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో బిఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కాకుండా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు  ప్రాధాన్యత నిస్తుందని, అందులో భాగంగా  రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ప్రతి జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 2 లక్షల వరకు ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని, మూడవ అధికారంలోకి వస్తే  రూ. 15 లక్షల వరకు వైద్యం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇతర పార్టీలో నుంచి చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని, కొత్త, పాత అని తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్  తిరుపతి రెడ్డి, హవేలి గన్పూర్ ఎంపీపీ  నారాయణరెడ్డి,  కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, హవేలీ ఘన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.