బలహీన ప్రతిపక్షమే మోదీ బలం

బలహీన ప్రతిపక్షమే మోదీ బలం
  • అవినీతిని ఎన్నికల అంశంగా ప్రజలు భావించడం లేదు
  • సీనియర్ పాత్రికేయుడు సుతను గురు

ముద్ర ప్రతినిధి, హైదరాబాద్: సవాలక్ష సమస్యలతో దేశ ప్రజలు సతమతం కావడం ఎంత సత్యమో, ప్రజల్లోని అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోగల ప్రతిపక్షం లేకపోవడం కూడా అంతే సత్యమని సీనియర్ పాత్రికేయుడు, సీ - వోటర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సుతను గురు అన్నారు. 'ఇండియా టు భారత్' పేరిట 90- రోజుల దేశయాత్ర చేస్తున్న గురు, తన ప్రయాణంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలో మూడురోజుల పర్యటన సందర్భంగా నియో సైన్స్ హబ్ - సైన్స్ అండ్ టెక్నాలజీ మాసపత్రిక, 'స్మార్ట్ లాబ్ టెక్' ఏర్పాటు చేసిన ప్రెస్ ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సుతను మాట్లాడుతూ, ఉపాధి అవకాశాలు మృగ్యం, ప్రభుత్వోద్యోగాల ఊసే లేదు, జీవన స్థితిగతులు అస్తవ్యస్తమయ్యాయి; కానీ, ఈ బాధలన్నీ అనుభవిస్తున్న సగటు ఓటరు మాత్రం మళ్లీ నరేంద్ర మోదీ వైపే మొగ్గుచూపొచ్చు అన్నారు సుతను. దానికి కారణం, ప్రతిపక్షాల మీద ఏ మాత్రం నమ్మకం లేకపోవడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. 

తాను చేస్తున్న 'ఇండియా టు భారత్' యాత్ర - రాజకీయాలకు అతీతం కాదుగానీ, రాజకీయనాయకులకు మాత్రం ఎంతో దూరమని ఆయన ఓ ప్రశ్నకి బదులుగా చెప్పారు. అందుకే, 60 రోజుల నుంచి జరుగుతూ, మరో 30 రోజులు సాగనున్న తన యాత్రలో ఏ ఒక్క రాజకీయనాయకుడిని కూడా కలవలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని సామాన్యుడి ఆలోచనలు తెలుసుకొని, అభిప్రాయాలు పంచుకొని, ఆకాంక్షల్ని అర్థంచేసుకోవడమే తన ఇండియా టు భారత్ యాత్ర అంతరార్థమని సుతను చెప్పారు. 

ఏ పార్టీ అవినీతికి అతీతంకాదనే స్పష్టత ప్రజలందరికీ ఉందనీ, అసలు అవినీతి అనేది ఎన్నికలలో అంశం కావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక అవసరాలు తీర్చే నాయకులకే వోట్లు వేసుకునే చైతన్యం ప్రజల్లో వచ్చిందన్నారు. సంక్షే మ పథకాలు ఉత్తరాదికి కొత్త గానీ, దక్షిణాది రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి మోదీ సంక్షేమ పథకాల మంత్రం దక్షిణాది రాష్ట్రాల్లో పనిచేయడం లేదని అభిప్రాయపడ్డారు. 

ముస్లిం ఓటర్లు కచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. అయితే, హిందువులమని ప్రకటించుకోవడానికి, ఆ మేరకు తమ ఉనికిని గుర్తించబడటానికీ హిందువులు గతంలోలా సంకోచించకపోవడం- బహుశా బీజేపీకి కొంత ఊరట అని సుతను విశ్లేషించారు. 

ఎన్ ఎస్ హెచ్ - మీడియా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో తన అనుభవాలు పంచుకోవడానికి అంగీకరించిన సుతనుకి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ వెంకట సత్యప్రసాద్ పోతరాజు కృతజ్ఞతలు తెలిపారు. నవతరానికి సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల ఆసక్తిని కలిగించి, వారిలో శాస్త్రీయ భావాలని పెంపొందించాలనే ఆదర్శంతోనే నియో సైన్స్ హబ్ మీడియాను స్థాపించి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు పోతున్నామని ఆయన వివరించారు. ఈ సమావేశానికి సీనియర్ పాత్రికేయుడు, రచయిత, రాకా సుధాకర్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎన్ ఎస్ హెచ్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుబ్రమణియన్ అయ్యర్ తొలిపలుకులతో మొదలైన ఈ సమావేశం, రెష్మీ కుమారి వందన సమర్పణతో ముగిసింది.