మోరంచపల్లి కోలుకునేది ఎన్నడూ..?

మోరంచపల్లి కోలుకునేది ఎన్నడూ..?
  • దూరమైన ఉపాధి మార్గాలు..
  • తీవ్రంగా నష్టపోయిన ప్రజలు..
  • ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపులు..
  • స్వచ్ఛంద సంస్థల సహాయంతో వెల్లదీస్తుతున్న బాధితులు..

 ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొరంచపల్లి గ్రామం కోలుకునేది ఎన్నడూ..? అంటూ సర్వం కోల్పోయిన బాధిత ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ప్రకృతి వైపరీత్యానికి తమ జీవితాలు ఆగమయ్యాయని ఆవేదన చెందుతున్నారు. ఎవరు ఏ సహాయం అందిస్తారని ఎదురుచూపులతో కాలం వెల్లదీస్తున్నారు. అతి భారీగా కురిసిన వర్షం, మోరంచవాగు ఉప్పొంగి వరద బీభత్సం సృష్టించడం, మోరంచపల్లి గ్రామం నీట మునిగిపోవడం, ప్రాణాలు దక్కించుకోవడమే గగనమైన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ, వరద బీభత్సం భారీ నష్టమే మిగిల్చింది. వరద బీభత్సానికి నలుగురు నీటి ప్రవాహంలో కొట్టుకపోయి మృతిచెందగా, గ్రామంలోని మూగజీవాలు వరదలో మునిగిపోయి మృతి చెందాయి. పంటలు ధ్వంసమై పనికిరాకుండా పోయాయి. ముఖ్యంగా ఇళ్లలోని ముఖ్యమైన వస్తువులన్నీ కొట్టుకుపోవడం గ్రామస్థులను కోలుకోకుండా చేసింది. 

  • పాడి పోయే.. పంట పాయే..

మోరంచవాగు వరద ప్రవాహంతో పాడి పశువులన్నీ కొట్టుకుపోయాయి. మరో వైపు పంటలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. దీంతో ఉపాధి మార్గాలు కోల్పోవాల్సి వచ్చింది. అటు ఇంట్లో ముఖ్యమైన వస్తువులు పోయి, ఇటు ఉపాధి లేక మోరంచపల్లి బాధితులు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ దినదినగండంగా బ్రతుకీడ్చుతున్నారు. స్వచ్ఛంధ సంస్థల సహాయ సహకారాలతో ఏ రోజుకారోజు గడుపుతున్న మోరంచపల్లి గ్రామం, ప్రభుత్వం అందించే సాయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంది.  ప్రకృతి సృష్టించిన బీభత్సానికి ఎన్ని చేతులు సాయమందించినా గత జీవితాల్లా ఉండేలా లేవు. పాత రోజుల్లా గ్రామం ఎప్పుడు కోలుకుంటుందని ఎదురుచూపుల్తోనే గ్రామ ప్రజలు ధీనావస్థలో గడుపుతున్నారు. ఏది ఏమైనా 238 కుటుంబాలు జీవిస్తున్న మోరంచపల్లి గ్రామం కష్టాల నుండి తొందరగా తేరుకోవాలని జిల్లాలోని ప్రజలు ఆశిస్తున్నారు. 

  • వరద బీభత్సానికి జిల్లాలో జరిగిన నష్టం వివరాలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద బీభత్సానికి జరిగిన నష్టం వివరాలు అధికారులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. జిల్లాలో వరద ప్రవాహంలో నలుగురు కొట్టుకుపోయి మృతి చెందగా, 1131 మూగజీవాలు చనిపోయాయి. అదేవిధంగా 29 ఇండ్లు పూర్తిగా కూలిపోగా, 485 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఇక వ్యవసాయ సంబంధించి పరిశీలిస్తే.. 13290 ఎకరాల్లో వరి, పత్తి పంటలు, 11891 ఎకరాల్లో మిర్చి పంట, 2500 ఎకరాల్లో ఇతర పంటలు, 264 ఎకరాల్లో ఉద్యానవన పంటలు ధ్వంసం అయి, నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా 101 రోడ్లు, వంతెనలు కలిపి ధ్వంసం కాగా, 136 నీటి ట్యాంకులు ధ్వంసం అయ్యాయని అధికారులు వివరించారు