ముత్తిరెడ్డి, పల్లా ఇద్దరు దొంగలే..!

ముత్తిరెడ్డి, పల్లా ఇద్దరు దొంగలే..!
  • టికెట్‌ కోసం తిట్టుకున్న.. ఇప్పుడు ఒక్కటైన్రు
  • స్థానికేతరులను తరిమికొట్టే టైం వచ్చింది..
  • బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ : జనగామను పదేళ్లు పాలించిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఇప్పుడు వస్తున్న పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి ఇద్దరు దొంగలేనని బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి విమర్శించారు. ముత్తిరెడ్డి భూ కబ్జాకోరైతే.. పల్లా ఎడ్యూకేషన్‌ మాఫియా డాన్‌ లాంటి వాడని మండిపడ్డారు. శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరుట్ల మాట్లాడుతూ జనగామలో స్థానికేతరుల ఆగడాలు ఎక్కువయ్యాయని.. వారిని తరిమికొట్టాల్సిన సమయం ఆస్నమైందన్నారు. మొన్నటి వరకు టికెట్‌ కోసం పల్లాను విమర్శించి జనగామ చౌరస్తాలో బట్టలు విప్పిన నిరసనకు దిగిన ముత్తిరెడ్డి ఒక్కసారిగా మారిపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పల్లాను జనగామ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఎంత సెటిల్‌మెంట్‌ చేసుకున్నాడో అని విమర్శించారు. ఇక ఈ పదేళ్ల కేసీఆర్‌‌ పాలనలో గాడి తప్పకుండా నడిచింది ఎక్సైజ్‌ శాఖ ఒక్కటే అన్నారు. తెలంగాణ యువతను తాగుబోతులను చేస్తున్న ఘనత కేసీఆర్‌‌కే దక్కుతుందన్నారు.

ఎక్సైజ్‌ పాలసీ అడ్డదిడ్డంగా మార్చి చెక్కులు ఇస్తే చాలు లిక్కర్‌‌ సప్లై చేస్తున్నారని ఆరుట్ల ఆరోపించారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడాలన్నా.. అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలన్నా.. అది బీజేపీకి మాత్రమే సాధ్యమన్నారు. రిటైర్డ్‌ కల్నాల్‌కు ఆహ్వానం.. జనగామకు చెందిన రిటైర్డ్‌ కల్నాల్‌ డాక్టర్‌‌ మాచర్ల భిక్షపతి, ఆయన సతీమణి స్వరూపను బీజేపీలోకి ఆహ్వానం పలికారు. డాక్టర్‌‌ భిక్షపతి హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.. అక్కడి నుంచి జనగామ వచ్చిన ఆయనను జిల్లా అధ్యక్షుడి హోదాలో దశమంతరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ సైనికుడిగా దేశ సరిహద్దుల్లో ఎంతో సేవలందించానని, సొంత గడ్డకు సేవ చేసేందుకే బీజేపీలో చేరినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇక పోరాటల పురిటి గడ్డ అయిన జనగామలో స్థానికేతరు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. ఈ సారి స్థానికులతోనే బీజేపీ ముందుకు వస్తుందని, ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఉడుగుల రమేశ్‌, సౌడ రమేశ్‌, యుగేందర్, అంజిరెడ్డి, సంపత్‌కుమార్‌‌ పాల్గొన్నారు.