ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
  • జీడికల్‌లో రూ.4 కోట్లతో పనులు
  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: ఆలయాల అభివృద్ధిపై కేసీఆర్‌‌ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, లింగాలఘణపురం జడ్పీటీసీ గుడి వంశీదర్ రెడ్డితో కలిసి జనగామ జిల్లాలోని జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌‌ను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాముడిని నమ్ముతున్నామంటూ రాజకీయాలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ, గతంలో పాలించిన కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నడూ ఆలయాలను పట్టించుకోలేదని ఆరోపించారు.

కేసీఆర్‌‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. జీడికల్‌ దేవాలయ అభివృద్ధికి స్థానిక నేతల కోరిక మేరకు ఇప్పటికే  రూ.4 కోట్ల నిధులు అందజేసినట్లు చెప్పారు. చేపట్టిన పనులు జూలై 24వ తేదీ వరకు కంప్లీట్ చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌‌ అమలు చేస్తున్న పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయన్నారు. దేశ ప్రజలు కేసీఆర్‌‌ను కోరుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఈవో శేషుభారతి, బీఆర్‌‌ఎస్‌ లీడర్లు బొల్లం నాగేందర్‌‌, రుషిగంపల ఆంజనేయులు, గంగాధర్‌‌, దూసరి గణపతి, గుర్రం బాలరాజు, భాగ్య తదితరులు పాల్గొన్నారు. 

అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం.. 
ఇదిలాఉంటే ‘జనగామ నుంచి మీరు పోటీ చేస్తారని వస్తున్న వార్తలకు మీ సమాదానం’ అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సున్నితంగా త్రోసిపుచ్చారు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమంటూ దాట వేశారు. అయితే ఈ ప్రచారంపై గతంలో పోచంపల్లి తాను జనగామ నుంచి పోటీ చేయనంటూ ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి స్పష్టమైన జవాబు ఇవ్వకుండా హైకమాండ్‌పైకి నెట్టి వేయడం అసక్తి రేపుతోంది.